కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

08. ఆడవాళ్ళు

దాగులు మూచీ దండకోర్‌ పిల్లీవచ్చే ఎలికాపో అను పాటను ముందుగా పుట్టించి సృష్టించె భగవంతుడు స్త్రీలనూ పురుషులనూ సర్వ ప్రపంచం!

దాగులు మూచీ పల్లవిని ఆడవాళ్ళ కళ్లల్లో, దండాకోర్‌ పదాన్ని మగవాళ్ల మనసుల్లో, పిల్లీవచ్చే ఎలికాపో చరణాలే గిర్రుమని పరుగెత్తే కాల చక్రాన గుచ్చబడిన ఊచలు!

దురదృష్ట వాయువుల నల్లాడు నికృష్ట జీవులం: ప్రాపంచక రహస్యాలు మాయందు జీర్ణించి మాకైనా పూర్ణముగా తెలిసీ తెలియని లోతులో చీకటిలో నివసించి నిద్రించు చుండును!

మగపిల్లా ఆడపిల్లా ఏమిటని పురిటింట ప్రశ్నపడే సమయాన మగపిల్ల మమకారం మాకన్న ఎవరికీ?

ఆడపిల్ల అనగానే మగవాళ్ళు ముఖం చిట్లించటం ఆడవాళ్ళ నవమానమరచినట్లైనా ఆడవాళ్ళ నాడవాళ్ళే అవమాన పరుచుకుంటాం! ఇచ్చకపు చేతులతో చనవు మాటలతో సుఖదుఃఖాల రెంటినీ ఇవ్వగలం!

స్వర్గానికెళ్ళినా నరకానికెళ్లినా విధిదూత వేధకగ్రహమై మావెంట వస్తుంది!

ఒక్కొక్క కన్నీటి పాటలో ఒక్కొక్క వేదనా విషయాన్ని కలిపి కలకాలం పాడినా మేము కాలం కదులుతూనే ఉండును! కన్నీళ్లు కళ్ళనే కరుచుకొని వేదనలు విరుచుకొనును! ఏనిముషాన జూచినా ముందుగతి గతిమాలి కన్పించును!

వినబడీ వినబడక దూరాన తిరుగుతూ దూరాన వినబడే ప్రతిధ్వనులన్నీ ఏకమై దూరాననే నిశ్శబ్దమౌరీతి మాదీర్ఘ నిశ్శ్వాసాలు పదివేలు పద్మవ్యూహాలు దాటినా, తరాలు వ్యాపించి దొర్లినా మృగతృష్ణ తీరాన మూర్ఛిల్లు జీవాల ప్రాణాలవలే ఆరిపోవును.

ఆశలడుగంటిన వాళ్లము ఆడవాళ్లము!

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )