| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
09. పైనం
రెండ్లెడ్ల బండదుగో! గండ్లమెడల యెడ్లవిగో! గణ గణల మంటున్నయి!
మూటలో బువ్వేసి బువ్వ మూటందుకో! పోవాలి పొరుగూరు, లెగుతుండయ్ పచ్చులు, గణ గణల మంటున్నయి!
వరిబియ్యం దరలేదు డబ్బూ దస్కం లేదు! కాత్తో కూత్తో వడ్లమ్మి డబ్బూ దస్కం తెత్తాను! పొరుగూరు పోవాలి, పొరుగాళ్లు లేచారు, గణ గణల మటున్నాయి!
ముంతలో మూలుగులు మూలుగుల ముంతలో గణ గణల మంటున్నాయి!
తలగుడ్డ చుట్టనీ, చెర్నాకోలందుకో! సిగ్గొయ్య జాగ్రత్త! ఇంటికాడ బద్రం!
సిన్నమ్మాయి జాగ్రత్త! పొయిగుంట బద్రం!
యారింటి కెళ్లాకు, యార్నీ చార్చీయాకు!
బుద్దిగలిగుండేవు! బుల్లోడిమీదొట్టు! వత్తానో రానో - దార్లో దొంగోళ్లు! వత్తానో రానో - సూర్లో సుక్కుంది! పొయిగుంట పగడాలూ కాసులూ బద్రం! వత్తానో రానో! సిన్నోళ్ళకి సుక్కియ్యి! వత్తానో రానో! పెద్దోళ్ళకి పొలమియ్యి! వత్తానో రానో! పొయిగుంట తీసుకో! పోవాలి పొరుగూరు! గండ్లమెడ యెడ్లవిగో! గణ గణల మంటున్నయి, గణ గణలు!