కవితలు నవమి చిలుక శిష్‌ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్‌

04. అగ్రహార బ్బడితె

అగ్రహారబ్బడితె అగ్రహారంలోనే గాదు
ఆచుట్టు పక్కలంతా అల్లరి పిల్లాడు.
అగ్రహారబ్బడితె అగ్రహారంలోనే గాదు
ఆటల్లో అందంలో అందరాని చెయ్యి!
అవధాన్ల నడిగి పొడుం పీలుస్తాడు
అల్లాంఖా న్నడిగి బీడీ తాగుతాడు
అమ్మమ్మ నడిగి అణాలుచ్చుకుని
అత్తయ్య నడిగి అట్లు పుచ్చుకుని
అగ్రహారబ్బడితె బజారొస్తే
అగ్రహార పిల్లలందరికీ పెద్ద!

చెలుగుడులో చిచింద్రీ! చెరువు పక్క చేలల్లో బలిగుడులో కోపుకాస్తుంటే కులుకుతూ కూలబడి చూస్తారు చేడియలు చోద్యంగా!

బిళ్ళంగోడాటలో బిళ్ళతప్పి పడితే ఏపిల్లగూడా చల్లగా చూస్తూ నవ్వితే నవ్వుతుందిగాని మంధరంత మారాముడి చేయదు! అట్లతద్దె రోజున అతని ఉయ్యాల్లోనే అంతంత పిల్లలూ ఆడుకుంటారు. శ్రీరామ నవమిలో శ్రీనాథుడల్లే స్త్రీ సమూహంలో చొరబడి సెరబడ్లు చేస్తూ వడపప్పు పానకం విసనకర్ర లిస్తూ వేళాకోళము వరసలూ విసిరి వేస్తుంటే వాడు - వేడి నిట్టూర్పుతో విసిగి వేసారి పురాణం చెప్పే పండితుడు చూచి యవ్వనాన్ని తలచి ఏడిస్తే ఏం లాభం?

బ్రహ్మదేవుడూ విష్ణుదేవుడూ శివుడూ వంచన బుద్ధితో వెళ్ళి వంచింప బడ్డారు గాని అగ్రహారబ్బడితెని ఆటల్లో చూస్తే అనసూయ గూడ అనుకునే దేమో!

ఈ మధ్య కాకతాళీయంగా ఈ ఊరు బాగుండ్లా పరదేశం పోవాలి ఈ వూళ్ళో ఏముంది ఈసడింపులే గాని పోవాలి పోవాలి పరదేశం పోవాలి! అని అతడంటే అందరూ వద్దన్న వాళ్ళే!

నాన్నతో చెప్పలా నాన్నంటే భయం! అమ్మతో చెప్పలా అమ్మ ఏడుస్తుందని! కుర్రాళ్ళతో చెప్పలా కూడా వస్తారని! పిల్లలతో చెప్పలా పిచ్చి మనసవుతుందని! ఊళ్ళో చెప్పలా ఊరు వదిలాడు! ఊరవతల చెప్పలా ఊరు దాటాడు!

పయర్లు పండినవి. పడమటిగాడ్పులొచ్చినవి. దుమ్ములెగరేస్తూ హోరు పెడుతున్నది గాలి! దుక్కి టెద్దులుగూడా దాహమంటున్నవి, కాలవలో నీళ్లు కరచుకుపోయినవి! చెరువులో చెమ్మగూడాలేదు! బయళ్లు భగ్గు మంటున్నవి! బావులు బావురు మంటున్నవి! జోరుటీగైనా గూడుకదలని ఎండాకాలంలో నాన్నతో చెప్పకుండా అమ్మతో చెప్పకుండా ఊరువదిలాడు ఊరుదాటాడు.

పచ్చికలు పచ్చగా బయళ్లు బాగున్నవి! కాలువలు నిండినవి! కలువలు విచ్చినవి! అగ్రహారబ్బడితె అగ్రహారంలో లెడు. అగ్రహారం అంతా అదో మాదిరి ఐంది!

AndhraBharati AMdhra bhArati - kavitalu - navami chiluka - SiShTlA umA vijaya mahESvara vinAyak - Shishtla Umamaheswara Rao - Sishtla Umamaheswara Rao - kavitalu kavitvaM geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - telugu kavita - tenugu andhra ( telugu andhra andhrabharati telugu literature )