| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
06. బాలవీరుడు
చావుకో జయముకో చారణ గీతాలతో నడవండి నడికట్టు కట్టి అడుగులేయుచు! అని నాయకుడరవగానే ఆ ఊరి వాళ్ళంతా లేచారు!
ధూళి ధూసరాలు దుమ్ము లెగరేస్తూ దూకుతూ వచ్చారు దండధరులు.
బూటుతో తన్నారు భగ్గు మన్నారు! కర్రతో కొట్టారు కర్రుమన్నారు!
బూటు చిరిగింది! కర్ర పగిలింది! ఉద్దండ పిండాలు ఊరి వాళ్ళంతా - చావుకో జయముకో చారణ గీతాలతో నడిచారు! నడికట్టు కట్టారు, అడుగు లేశారు!
ఆ వూరి వాళ్ళల్లో ఆరేళ్ళ బాలుడున్నాడు - బుగ్గ గిల్లితే పాలు కారుతవి; కాలు కదిలితే కందుతుంది; ముత్యాల పలవరస ముక్కు మాణిక్యం! బాలకృష్ణుని వంటి బాలుడల్లే వాడు తల్లి వెనక పిల్లాడు, తల్లి కంటే ముందు;
చావుకో జయముకో చారణ గీతాలతో నద్డిచాడు నడికట్టు లేకుండా అడుగులేశాడు.
అందాల తల్లి యవ్వనంలో ఉంది అందరాని పండువలె దండధరులకు!
గడప దాటెరుగదు కుంకానికైనా, ఇల్లు దాటెరుగదు ఇంగువకైనా, పొల్లు మాటెరుగదు పగనుంచి యైనా, పొరపాట్లెరుగదు పుట్టింటనైనా. అగచాట్లెరుగదు అత్తింటనైనా - చావుకో జయముకో - నడిచింది నడుకట్టు కట్టింది అడుగు లేసింది!
చూచి చిల్లులు పడ్డవి కళ్ళు దండ ధరులకు! తాగి తందనా లాడుతూ దండధరులు పైట పట్టుకు లాగారు దండధరులు - పాడుతూ నుంచుంది పతివ్రతా తల్లి! పతివ్రతా తల్లి ప్రాణాని కడ్డెవ్వరు?
చీర చుట్టు విప్పారు దండధరులు - సిగ్గుతో నుంచుంది మానవతీ తల్లి! మానవతీ తల్లి మానాని కడ్డెవ్వరు?
(పేపరులో పడబోదు పతివ్రతా తల్లి! పేపర్లు దక్షిణాన, పేర్లుత్తరాన!)
ఆవూరి వీరులంతా కర్ర దెబ్బలకు కంది పుండైన దేహాల కైడోఫారము రాస్తూ కూర్చున్నారు!
ఆ తల్లి పట్టుదలకు అలిసి విసిగి వేసారి తలమీద మోదితే దండధరులు, స్మృతి తప్పి పడిపోయి చేతిజండాను వదిలింది వీరమాత!
చూచాడు తల్లి పడిపోటం, లేచాడు పల్నాటి బాలచంద్రు డల్లే!
వాడి హృదయంలో, వాడి రక్తనాళాలలో పూర్వాంధ్ర ప్రతాపాగ్ని రగిలి సురసురాజ్వాలలై వాని చిన్ని ఆత్మ అంతా పొగబారి వాని దేహమంతా కాగి, ఊగి, ఉడికి ఉడికి వేడెక్కి వేడి యావిరవగా చెంగు మంటూ బాలుడు, గోకులాష్టమి నాడు ఉట్టి కెగిరే రీతి, గంతేసి నిలిపాడు ఊరి జండాను!