| కవితలు | నవమి చిలుక | శిష్ట్లా ఉమా విజయ మహేశ్వర వినాయక్ |
13. పొద్దున్నుంచీ పొద్దాకా!
పొద్దున్నుంచీ పొద్దాకా పొన్నంగి పిట్టల పాటల్లోనే, పొద్దున్నుంచీ పొద్దాకా సమస్త జనుల సంతోషాలు, సన్నని గొంతుల గీర యేడుపులు, సరసవిరసపు సంగతులన్నీ పొంగి పారుతూ పగలవుతున్నవి.
పొద్దున్నుంచీ పొద్దాకా పొన్నంగి పిట్టల కూతల్లోనే కూయి కూయి మను కూతల్లోనే పొన్నంగి కూతల పల్లవులలో పారుటాకుల పాన్పుల నుంచి పూవుల రాణులు పుక్కిలించుతవి! పొద్దున్నుంచీ పొద్దాకా పొన్నంగి కూయిల ఉయ్యాలలలో పండుటాకుల పవళింపులలో పూవుల రాణులు పొద్దు పుచ్చుతవి!
కొక్కొరో కో మని కోడి కూయగా ప్రొద్దున్నే అమ్మా రావే బని పిల్లాళ్లంతా లేస్తారు! ఊ! ఇదిగో! మరే! ఊ! ఊ! అని భార్యాభర్తలు లేస్తారు!
కొక్కొరో కో మని కోడి కూయగా ప్రొద్దున్నే కాఫీ కడుపులు కదల బారతవి! పొద్దున్నుంచీ పొద్దాకా కోడి కూసినా కూయక పోయినా కోడికూతలకు ముందరగానే పనివాళ్లంతా పనికి పోతారు! పనివాళ్ళంతా పనిలో ఉంటారు!
కోడికూసినా కూయకపోయినా ఫాక్టరీ గొంతుల కీచుకూతలు, చాకలి రేవుల ఈలల ఊతం వినవద్దన్నా వినబడుతుంటవి!