కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 103. ఆనందమే లేదా
103. ఆనందమే లేదా
ఆనందమే లేదా
    లోకమున
నానందమే లేదా?
ప్రకృతి యందముల
పరికించుటలో        ఆనంద...
ఇంపగు నీ సెల
యేటి గానమున        ఆనంద...
కూకూ యను నీ
కోయిలపాటల        ఆనంద...
వీనులవిందౌ
పిట్టలబాసల        ఆనంద...
పూవులు దాల్చు న
పూర్వపు శోభల    ఆనంద...
చిగురుటాకుల
న్నగు వసంతమున    ఆనంద...
అరుణములౌ సాం
ధ్యారాగంబుల        ఆనంద...
మైమఱపించెడు
మలయవాయువుల        ఆనంద...
పాఱెడు మబ్బుల
పందెపు పరుగుల    ఆనంద...
మొగిలు కన్నియల
ముద్దు మోములను        ఆనంద...
చక్కదనంబుల
చందమామ గన        ఆనంద...
మిన్నున చుక్కల
మిన్కు మిన్కులను        ఆనంద...
చలువ వెన్నెలల
సయ్యాటలలో        ఆనంద...
అలరుందేనియ
లాని పాడుటలో        ఆనంద...
తీయనిపండ్లను
దిని యాడుటలో        ఆనంద...
కీచురాయివెత
కీయని పాడగ        ఆనంద...
నిశీథముల గను
నిశ్శబ్దములో        ఆనంద...
చోద్యపు లోకము
చూపు నిద్రలో        ఆనంద...
పులుగుల మేల్కొలు
పులు విని లేవగ    ఆనంద...
ప్రభాతవాయువ
బరవశ మొందగ    ఆనంద...
దేదీప్యంబుగ
తేజరిల్ల మిను        ఆనంద...
బాలభాను డం
బరమున వెల్గగ    ఆనంద...
లోచనంబులకు
లోకము గన్పడ        ఆనంద...
ఆదర్శములా
కాశము నంటగ    ఆనంద...
పొంగెడు నాసలు
పురికొల్పగ మది    ఆనంద...
భగవంతుని కడు
భక్తి బాడగను    ఆనంద...
ఆనందమే లేదా
    లోకమున
నానందమే లేదా?
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 103. AnaMdamE lEdA - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )