కవితలు బసవరాజు అప్పారావు గీతాలు 099. సంవత్సరాది
99. సంవత్సరాది
బాలభాస్కరా! అపుడే
వచ్చితివ ఉగాదియంచు
బంగరు కిరణాల దుస్తు
లం గడు మెరయుచు కులుకుచు
గల గల మని వీచెడు చిఱు
గాలిపాట కలరియాడు
మావియాకులార! మఱచి
పోవుదురే యింతలోనె
వెన్నెలలో నాయెదపై
బన్నుండి భవద్దర్శన
మ్మున బ్రహ్మానందమ్మును
గను ముద్దుల నా బిడ్డను
తోరణాల దూర నేగు
తొందరలో నున్న మిమ్ము
నాపబోను, లోలోననె
యావేదన నడచికొనెద!
వేపకొమ్మలార! నాల్గు
వేళల నా బిడ్డపైని
ప్రాణవాయువులను వీచి
బ్రతికించెద రనుకొంటిని!!
కాని శాస్త్రసిద్ధాంతము
కందని యొక మహాశక్తి
నాదుబిడ్డ గొంపోయెను
మీ దేమున్నది పాపము!
మినుకు మినుకు మినుకు మనుచు
మింట మెరయు చుక్కలార!
చెప్పరేల మీలో నా
చిన్నితల్లి యెవ్వరొక్కొ!
చెప్పవద్దులే వరాల
కుప్పను కాపాడి మరల
వప్పగింపు డీ స్వర్గము
నందున మా కంతెచాలు!
అమృతకిరణ కన్నె మంగ
ళప్రద బ్రతికింపజాల
నైతి నంచు సిగ్గు జెంది
యథోగతిని బోయితివే?
చాలును నీలాంఛనమ్ము
లేల? నేడుగాకయున్న
రేపైనను రావొక్కో
నీపస జగమెఱుగనిదే?
కన్నకడుప యేమి, నీకు
కలుగు నెట్టు లహర్నిశలు
కనలి పొక్క జేయు నాదు
కడుపుమంటవలని తపన!
పోయినవత్సరపు సుఖము
బుల్లితల్లి తోనె పోవ
నూతనసంవత్సరాది
నీతీరుగ వగవనాయె!
AndhraBharati AMdhra bhArati - kavitalu - basavarAju appArAvu gItAlu - 099. saMvatsarAdi - basavarAju appArAvu geetaalu - Basavaraju Appa Rao - Basavaraju Apparao geeyamulu gEyAlu geeyaalu geeyAlu paatalu pATalu - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )