కవితలు చీకటి నీడలు - బైరాగి 05. వేశ్య
వేశ్య

ఆ అచ్చొత్తిన ఓరచూపులా
అవా మరుని తూపులు?
విద్యుత్కాంతులు
చల్లనిరేయి అశాంతులు
ఎరువిచ్చిన శృంగారం
నీ తళతళ మెరిసిన గాజులు
నీ గిల్టు చంద్రహారం?
అణా పూలు, కానీ తాంబూళం
నలిగిన చీరలు, చీకటి ముసుగులు
ఇదా నీకు జీవితమిచ్చిన బహుమానం?
ఈ సౌందర్య ప్రపంచపుదానం?
చీకటి కొలతల ఆతృత
వినిపించని మెల్లని గుసగుసలూ
క్షణమాత్రపు చూపుల సంతోషం
చెరగుచాటు పాపపు రుసరుసలూ
నిదురించిన ప్రపంచగర్భంలో
మేలుకొన్న ఆకలిలా పాపం
మిణుకుమనే ఆవీధి లాంతరుల
నీడల పొంచియున్న విధిశాపం.
ఆ ఆనందపు బేరగాని
గుండెలలో ఏదో తెలియని దడ
తట్టని తలుపుల చప్పుడు
నడువని అడుగుల సవ్వడి
గొనుగుతాడు తడబడు మాటలతో
వణుకుతాడు గడగడ
సన్నిపాత జ్వరపురోగి.
నడిరేయి పీడకలలో
మెలకువలా, వెచ్చని చెమటారిన
చేతిలోన జారిన
మెరిసే నాణ్యాలు రెండు
ఓ వేశ్యా!
నీవంటే నాకు అసహ్యం
ఎందుకనగ నీ కుళ్ళిన ఆంతర్యం
నా తళతళ మెరిసే బాహ్యం
మా చీకటిలోయల లోతుల్లో
నీ పూజా శిఖరాలూ
మా పాపపు చీకటిశాపాలే
నీ మిణుగురు వెలుగు వరాలూ
మా అచేతనపు మనసుల
బురదతోడ చేసినబొమ్మా!
నిన్నుచూచి కాదమ్మా నా కోపం
నీ బ్రతుకు టద్దమందున
సిగ్గులేక ప్రతిబింబించిన
మానవ జీవితాల బీభత్సం
నన్నాకర్షిస్తున్నది
కాని మరల భయపెడుతున్నది
నీదు అధఃపతనపు లోతుల్లో
మారుమ్రోగు మానవజాతుల
క్రుళ్ళిన మనసుల బూతులు
నీబలవంతపు చిరునవ్వుల్లో
యుగయుగాల ఉప్పనిఏడ్పులు
నీచల్లని నిట్టూర్పుల్లో
బ్రతుకుటెడారుల గాడ్పులు
ప్రపంచపు ఫార్సుపైన
నీబ్రతుకు వ్యంగ్య చిత్రం
ప్రేమలు, పువ్వులు, నవ్వులు, ఉత్తరాలు, వివాహాలు
బ్రతుకు చేదుమాత్రపైన పంచదార అబద్ధాలు
మాయలు; జీవితసత్యం
దిశమొలతో నిలిచినరోజున
ద్వేషపు ప్రళయాగ్నులలో
మునిగిపోవు నీడలమోజులు
ఓకులటా! రూపాజీవీ!
అనాకారి బ్రతుకుల దౌర్భాగ్యపు
వెక్కిరింతలా నిలిచిన నీపై
నాపై జగతీతలిపై అలుముకొనే ద్వేషపుచీకటిలో
కరుడుగట్టు నెత్తుటిపాటలు
ప్రపంచమొక ప్రశ్నచిహ్నమై
నిలచును; ఉండవుమాటలు
జాలి! జాలి!
పేరుకొన్న చీకటి ముద్దవు, ముద్దరాల!
నా గుండెల మబ్బుల్లోమెరసిన
జాలిమెరపు నిన్నేమైనా
వెచ్చగ కరిగించేనా?
ఓ, ఎడారిబాటసారీ!
ఎండినగొంతుక, మండినగుండెల
పెనుదప్పిక తీర్చేందుకు,
బ్రతుకుటెండ కిగిరిపోవు.
మంచుబొట్లలా జాలాపానీయం?
అది పెదవులపై కాదామాయం?
ప్రేమా? ఔను నాకు నీపై ఒక చెప్పనలవిగాని ప్రేమ.
చింకిగుడ్డపైన బిచ్చగాని ప్రేమ
చీకటిలోగుడ్లగూబ, శిథిలగృహపు గబ్బిలాలు
జీవితకారాగారంలో పెరిగిన జీవచ్ఛవాలు
ప్రేమించక ఏం చేస్తారొకరినొకరు?
మానవులం!
నెత్తుట తడిసిన అడుగుల
కన్నీరుల ఉప్పనిమడుగుల
ఒళ్ళంతా పచ్చిపుళ్ళు, రసికారే కురుపులు,
మూగుతోన్న ఈగలు
ఎందుకు చీదర?
జీవితపు కాళ రాత్రి, గుండెలు పిండేచలి
భగభగమండే ఆకలి
పాపపు చిరిగిన దుప్పటిలో
గడగడవణికే మనకెందుకు చీదర?
జరగండింకా, ఇంకా దగ్గర!
వెచ్చని చలిమంట ప్రేమ
ఈ రేయి గడపలేమా?
చక్కని సూర్యోదయాల
బంగరు కిరణాల కలలు
వెచ్చని చలిమంటల కౌగిలిలో
చక్కలిగింతలు
ఎందుకు చీదర? రా ఇంకా దగ్గర.
AndhraBharati AMdhra bhArati - kavitalu - veeshya - chIkaTi nIDalu - AlUri bairAgi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )