| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 5. ఆమని | |
|
ఆమని ప్రొద్దునన్ మలయ మందలి చందన గంధవాహముల్ నా మునివాకిటన్ బడి స లాములతోడ కవాతు జేసి, ఆ మ్రామల శాఖికావళుల యందున నాట్యము సేసెబో; నిరా శా మృతజీవులార! మధు శాలలలో చషకమ్ము నెత్తుడా! | |
|
బ్రతుకులు దీర్ఘరాత్రముల భాతి చలింప, విషాద దంష్ట్రలన్ చితికి, విశాలమౌ ప్రకృతి నింపిన సంపద లెల్ల వీడి, దు ర్గతిబడి కుందు మానవుల కై కవితా మదిరానుపానమే అతులిత మోహనౌషధము; ఆమనిలో చషకమ్ము నెత్తుడా! | |
|
అదిగొ! వసంతరాజు, పువు టమ్ములతో మరు డేగుదెంచగా, మృదుల రసాల కౌసుమ ప రీమళ వీధుల సాగివచ్చి నా యెదుట పరాగముల్ చిలికె; నా ప్రియురాలి నవాధరోష్ఠమం దెదియొ రదచ్ఛదమ్ము కను పించె; సురా చషకమ్ము నొక్కెనో! | |
|
నా ప్రియురాలు నందనవ నమ్ముల పూవుల అంట్లు తెచ్చి నా కప్రపుతోటలో మడులు కట్టిన; దా కుసుమాల మాలలో అప్రతిమాన కింపురుష హాసములే కనుపించునంట! ప్రే మప్రసవాలు! మానస సు మాలు! ప్రియా దరహాస సూనముల్! | |