కవితలు దాశరథి కవితలు అగ్నిధార
4. ఉష
 
రక్తిల లోచనమ్ములు క
    ళారసధారల పారణమ్ముతో
వ్యక్తము లయ్యె నా నుదుటి
    యందున కెంపులు దేరి, నిశ్చలా
వ్యక్తసమాధిలోన కల
    మంది, నిషా విష మెక్కిరాగ నా
రక్తముతో ఉషా కరత
    లమ్ములలో కవనమ్ము లల్లెదన్‌.
అదిగో! ఉషాకుమారి, దర
    హాసముతో ఉదయాంగణంపు సం
పదలను కుంకుమాంజలులు
    పట్టుటకై జలతారుచీరెతో,
కదలెడు కౌనుతో తెలుగు
    గడ్డకు వెల్గులు పోయుచున్న, దు
న్మద గజరాజయాన, మధు
    మాస విలాస వికాస భాసయై.
తెలతెల వారు జాముననె
    తీర్చితి నా కవితాంజనమ్ము నా
కలములలోన; ఈ కరడు
    గట్టిన గుండెల రక్తవాహినుల్‌
జలజల బార కుచ్చిళులు
    జార్చెడి ఔషసరాగకన్య ఉ
జ్జ్వల మధురాధరోష్ఠమున
    జల్లెద నా కవితామృతాంబువుల్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - uSha - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )