కవితలు దాశరథి కవితలు అగ్నిధార
6. ఉగాది
 
రిక్కలు రాలిపోవ విద
    లించు ఉషో గగనాంగ భాగ మ
ట్లొక్కొక్కమారు కొప్పుపువు
    లొల్కగ తళ్కులపైట జార్చుచున్‌
చక్కనిలేమ యొక్కతె ని
    షా గొని వేప పువుం బ్రసాదముల్‌
మెక్కు మటంచు పంచినది;
    మెక్కితి చక్కదనంపు తీపితో.
అవును, ఉగాది వచ్చు సమ
    యంబున వెచ్చని వేపపూల, మా
ధవు డరుదెంచినాడు; బహు
    ధా పరిరమ్య వసంత శాంత సాం
ధ్య వికచ మల్లికా మధుర
    హాస విలాస వికాస భావసం
భవ రస నవ్య భవ్యగరి
    మా నత నూతన వర్షరాజుగా.
అవును, ఉగాది వచ్చె, పది
    యారుకళల్‌ నశియించిపోయి న
ల్లవడిన చంద్రికాగృహము
    లన్‌ కళదేరెను, దారి తప్పి పె
ల్లవిసిన బాటసారి రస
    నాగ్రమునందు మధూకమాలికా
స్రవ మధు విప్రుషమ్ములు వి
    రాజిలె తాపము నింక పెంచగా.
వేప పూత చేత ఊపిరాడని గుడ
మధుర ధార తిక్తమై చెలంగె;
చింతగుజ్జులోన చిక్కిన పసిమావి
పిందె లందు ఒగరు మందగించె.
ఈ ఉషఃకన్య కన్నులలో అమోఘ
నవ్య వాసంత కాంతులు నాటుకొనియె;
పాతకాలము పోయెను, లేతకాల
మరుగుదెంచె 'విరోధి' నామాంతరమున.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - ugAdi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )