| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 11. ఋతుషట్కము | |
|
బాకాలూది పికాధిరాజు దెసలన్ పల్కించె; మార్ర్మోతలన్ చీకాకై శుక శారికా గణము వి చ్చెన్ నోళ్లు నీళ్ళంచు; నా ళీక శ్రీక సరస్తటమ్ముల రసా లీ పాక ధారా రసం బా కంఠమ్ముగ ద్రావ రాగదవె బా లా! ఆమ్ర పాకస్తనీ! | |
|
తాపము నోపజాలను మ దప్రమదా! అదిగో! రసాలపున్ తోపుల కాపు లుందము; న దుల్ కలయాడెడి సంగమాలలో మాపులు దాటవేతము, క్ర మమ్ముగ ఊష్మము గ్రీష్మ మేగగా రేపు పయోద వాదములు రేగును, సాగును శీతవాతముల్. | |
|
వానలలోన, క్రొంజలువ వాగులలో, వడగండ్లలో పసం దైన పయంటయున్ పిరుదు నంటిన చీరెయు నాని పోవ రా వే వనకన్నె! కొంకున చ లించెను నీ తనువల్లి యెల్ల; శీ తానిలధారలో వలువ లారగ గట్టుము నా బుజాలపై. | |
|
చుక్కలు దాటి చెంగలువ సుందరి నొక్కగ చక్క వచ్చినా డక్కుముదా మనోహరుడు, అచ్చపు వెన్నెల గిన్నెలందునన్ చిక్కనితేనె పోసికొని చిన్నని పొన్నని కన్నెవాగులం దొక్కొక పాద మూని నడ లొత్తును చేపలుమ్రింగునో యనన్. | |
|
చలిచలి, చాలి, చాలని 'ర జాయి'ని కప్పుక కన్ను మూసి, ని ద్రలు వడబోసి, స్వప్నములు త్రావి, ప్రియాధర మారగించి ఆ కలి దిగబెట్టి వత్తును; జ గత్తును మొత్తము 'మెత్త' క్రిందనే నలిపి 'చెలీ చెలీ' యనుచు నాలుక దప్పి గొనన్ జపించనా? | |
|
ఆకులు రాలిపోయె, దెస లన్నిట చీరెలు జారిపోయె; న గ్నీకృతయై మహా ప్రకృతి నేలకు మోమును వాల్చె; దుష్టవా తాకులమై శరీరము, హృ దంతర మంతయు బీట లెత్తె; బా లా! కటి పోకముళ్లు విడ లాగెద శైశిర కాల రీతిగా. | |