కవితలు దాశరథి కవితలు అగ్నిధార
10. జైల్లో
 
ఇది నిదాఘము; ఇందు సహింపరాని
వేడి యేడ్పించుచున్నది; పాడువడిన
గోడలందున జైలులో పాడినాడ
వాడిపోనున్న పూమొగ్గపైన పాట;
మండు టెండల క్రాగిన గుండె నెత్రు
బండ వారిన మనసులో నుండి జారి
పచ్చ పచ్చని పూమొగ్గపై నటించి
ఎఱ్ఱవారిన దీగ్రీష్మ మేడిపింప.
చల్ల చల్లని వాగులన్‌ చిళ్లు చున్న
తుంపరల గుంపులోన కాలంపు కన్నె
తానమాడినదీ రసోద్యానవాటి;
వలువ విచ్చి నృత్యాలను సలిపె నేమొ!
ఈ యెండకాలమ్ములో యెన్ని వర్షాలు
దాగియున్నవొ! చూడసాగినాను;
ఆ యెడారి పొలాలలో యెన్ని గంగలు
పొంగునో! యని చూడబోయినాను;
ఆయాసపడు జైలులో యెన్ని ప్రజల రా
జ్యము లున్నవో! యని యరసినాను;
నిరుపేదవాని నెత్తురు చుక్కలో నెన్ని
విప్లవాలో! యని వెదకినాను;
నీళ్ళలో నిప్పుమాదిరి, నిప్పులోన
నీళ్ళమాదిరి, కష్టాల నీడలందు
సుఖము నివసించునంట! ఉస్సు రను వేడి
ఊర్పులోన పరీమళా లున్నవంట!
ఈ కాలానల కీలికా వితతిలో
    ఏ యిల్లు! యే యూరు! యే
లోకం బాగును? ఎంద రెందరు దరి
    ద్రుల్‌ చచ్చిరో! ఏ సతీ
శోకం బాకస మంటుచున్నదో! సుతుల్‌
    చుట్టాలు చల్లారిరో?
నాకున్‌ నీకు గణింప శక్యమె? దురం
    తక్రాంతి కాలార్భటుల్‌.
ఇట వసంతము లేదు, సహింపరాని
గ్రీష్మ హేమంత కాల కాళికలెగాని;
ఇట ఉషస్సులు లేవు; భరింపరాని
అంబువాహ సందోహ నిశాళి కాని.
వెన్నెలలు లేవు, పున్నమకన్నె లేదు,
పైడి వన్నెల నెలవంక జాడ లేదు,
చుక్కలే లేవు, ఆకాశ శోకవీధి
ధూమధామమ్ము, దుఃఖ సంగ్రామభూమి.
కాలదైవజ్ఞు డీ జగత్కన్య హస్త
తలము దర్శించి జ్యోతిషమ్ములు వచించు
"పరుల హింసించువారలు బాగుపడెడు
మాట వట్టిది, నశియించుమాట నిజము."
        (నిజామాబాదు జైలు)
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - jaillO - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )