| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 19. శిల్పి | |
|
చాగిల దీసి రాళ్ల నొక జాలుగ, వాగుగ, తోగులాగునన్ లాగెద వెట్టు లన్న నటు లన్; ప్రియురాలి పయంటలో అజం తా గుహలోని స్వప్నములు తాపిన నీ ఉలిముక్కు లోపలన్ దాగుడుమూత లాడె కవి తా లలితాంగి రహో విహరముల్. | |
|
రాలు మలంతు వీ వని వ రాలను కుప్పలు వోసి రాణివా సాలకు గొంచుబోయి ఒక చక్కని జాణను చెక్కు మంచు ర త్నాల నొసంగినారు నర నాథులు; లేజవరాలిమోవి స్తం భాలకు చెక్కినావు; ఉలి పన్నుల నొక్కులు తాకనట్లుగా. | |
|
నీ ఉలి చూచి ప్రస్తరము నీరయి పారును; వెన్నముద్దపై చేయిడి యొత్తినట్టుల, ని శీథములం దభిసారికా పదా బ్జాయత రాగరంజిత న వారుణ కంటకపాళి గూర్చి నే గేయము వ్రాసినట్లు; విలి ఖింతువు లోతగు భావముల్ శిలన్. | |
|
నిను గని కొండ లన్ని రమ ణీ కుచపాళికలై, కపోల మో హన ఫలకమ్ములై, భ్రుకుటు లై, కుటిలాలక జాలమై, సురాం గనలయి రూపు దిద్దికొన గా ఉలితో అమృతమ్ము చల్లి జీ వనములు పోసి పోయెదవు; బ్రహ్మవు శిల్పికులావతంసమా! | |
|
చెక్కిన రాతిలో - మధుర సీధువు లొల్కు విపంచికా రవం బుక్కు నరాలలో పలుకు లొత్తిన రీతి ధ్వనించునంట! ఏ లెక్కలతో ఉలిన్ కదిపి 'రిం'గను చక్కనిమ్రోత రాతిలో గ్రుక్కితి వయ్య! శిల్పి కుల కుంజర! పుంజిత బ్రహ్మతేజమా! | |
|
సుత్తెల మ్రోతతో అలసి చొక్కిన కొండలపిండు లెల్ల నో రెత్తి నినాద మిచ్చినవి "ఈ వెటువంటి మనోజ్ఞ రూపకం బెత్తు మటన్న నెత్తెదము; ఎందుల కిట్టుల మట్టి మట్టిగా మొత్తెద వోయి శిల్పి కుల భూషణ! శైల శిలా ప్రపేషణా!" | |
|
వెన్నవలెన్ కరంగును స్రవించును వెచ్చని అశ్రుధారగా నిన్నగపాళి, క్రొమ్మెఱుగు లీనుచు శిల్పకళా విలాస సం పన్నత గుల్కు నీ యులిని బట్టిన మోహన బాహుదండమున్ గన్నపుడెల్ల; ఎంత మొన గాడవురా శిలనే కరగించగా! | |
|
ప్రతి వికారశిలయు ప్రతిమయై వెలుగొందు పడతివోలె కులికి వలపు రేపు; నీ కరావలంబ నిభృతమైనపుడెల్ల రాతిరాతిలోన నాతి తోచు! | |