కవితలు దాశరథి కవితలు అగ్నిధార
18. నటస్వామి
 
చరమగిరి కూట భాగాన తెరచినారు
నాట్యశాలలు; సంధ్యా పినాకపాణి
గల్లు గల్లున గజ్జెలు కట్టి యాడి
యెల్లలోకాల నిద్ర కౌగిళ్ళ నూపు
బాలచంద్రుడు శృంగాలు వంచికొనగ
రింగు రింగున గంగమ్మ పొంగిపోవ
నాగసర్పాలు గాలిబోనాలు విడువ
నాట్య మాడెను సంధ్యా పినాకపాణి.
ఖర్వమై పోయె కైలాస పర్వతాలు;
మేరుచాపము వంగి కంపింప సాగె;
పాణినీయాలు డమరు శబ్దాన పలికె
నాట్య మాడగ సంధ్యా పినాకపాణి.
భూత బేతాళ గణములు చేతు లెత్తి
తలలు విరబోసి మృత్యు నృత్యాలు సేసె;
వల్లకాటికి యాత్రకు వెళ్లుచున్న
యముని కాసర మగ్నితోయములు త్రావె.
శివుని ఫాలాన పెను కారుచిచ్చు లేచి
గగన కబరీభరమ్మును కప్పుకొనియె;
చెంగు చెంగున నెగయు సారంగ మొకడు
శివ శిరశ్చంద్ర కేదారసీమ దోచె.
సగము దేహాన పర్వతస్వామి పుత్రి
కా లలామము మంగళాంగముల దీర్ప
సగము దేహాన విషనాగ భుగభుగముల
నాకు కనిపించె సంధ్యా పినాకపాణి.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - naTasvAmi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )