కవితలు దాశరథి కవితలు అగ్నిధార
20. మహాలేఖిని
 
పద్దెము వ్రాయుచున్‌ వెనుక
    వైపున చూడకు లేఖినీ! మహా
పద్దశ దాపురించును, గ
    బా గబలాగుము వేనవేలుగా
పద్దెము; లర్థవాదముల
    పై కను లుంచకుమా! పదావళుల్‌
ముద్దులు గార్చుచున్‌ కనుల
    ముందర తాండవ మాచరించెడిన్‌.
త్వరపడు! భావసాగరము
    బాహువు లెత్తుచు నీ శిరస్సుపై
పొరలుచు వచ్చుచున్నది; క
    వుంగిలిలో కవితాకుమారి సం
బరపడి నవ్వుచున్నది; గ
    బా గబ కూర్చుము పద్యరాశి; అ
ర్థ రహితమంచు పల్కెడి క
    ళా రహితున్‌ పడత్రోసి సాగుమా!
కొండలనుండి జారు నొక
    కోమల శైవలినీ ప్రవాహమున్‌
బండలతోడ కాలువలు
    వైచెడిదాక స్రవించ కున్న కూ
ర్చుండునె? మాధు బిందువుల
    నొల్కు మధూక సుమాల నోళ్లకున్‌
నిండుగ లొట్లు కట్టెదము
    నేలకు జారకు మన్న ఆగునే?
నాదొక వెఱ్ఱి; త్రాగుడున
    నాడును వీడును అమ్ముకొన్న ఉ
న్మాదివలెన్‌ కవిత్వమున
    నా సకలమ్మును కోలుపోయి రా
త్రీ దినముల్‌ రచించితిని
    తీయని కావ్య రస ప్రపంచముల్‌;
వేదన యేదియో కలత
    వెట్టును గుండియ నెందుచేతనో?
కొండలుకొండలే అడవి
    కోనల భగ్గున మండిపోవ, నా
గుండెలు గుండెలే అరుణ
    గోళములై ప్రళయాగ్నిమాలలై
మండుట చోద్యమా? మధుర
    మంజుల మామక లేఖినీ ముఖం
బెండకు మండిపోయి రచి
    యించును గ్రీష్మ మహా ప్రబంధముల్‌.
నా కఠినీ ముఖాంతరము
    నన్‌ నవనీల విశాల నీరదా
నీకము వచ్చి డాగి, దయ
    నీయముగా విలపింపగా, అసం
ఖ్యాకముగా మదీయ ఖటి
    కా లుఠితస్ఫుట పద్యజాలముల్‌
వాకలు వాకలై అలుగు
    వారును గుండెలు పొంగిపోవగా.
సందెలలో, తమో నిబిడ
    శాలలలో శివనాట్య మాడి, నా
అందెల మ్రోతతో బ్రతుకు
    నంతయు సందడి చేసి, ప్రేయసీ
సుందర మందహాస పరి
    శోభిత మామక మానసాంతరం
బందు రచింతు నీరవ ని
    రంత నిశా నిబిడార్ద్ర కావ్యముల్‌.
పది కావ్యమ్ములపాటు ప్రేమమయ ది
    వ్య స్వాంతగీతాలు వ్రా
సెద; కాంతాధర కంపిత ప్రవచన
    శ్రీలే ఉటంకించెదన్‌;
పదియార్వన్నెల చందమామ కను స
    న్నన్‌ చుక్క చెక్కిళ్ళపై
వెదజల్లెద మామకీన కవితా
    పీయూష ధారావళుల్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - mahAlEkhini - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )