కవితలు దాశరథి కవితలు అగ్నిధార
24. శ్రీమతి
 
(రవీంద్రుని "Fruit Gathering" నుండి)
పచ్చ బంగారు వెలుగులు పరచి పరచి
శారద దినాంతలక్ష్మి ముచ్చటలు సేయ
బుద్ధ భగవాను నాలయమున జనంబు
సభయ పూజాంజలు లొసంగు సమయమయ్యె.
బిందుసార మహారాజు పెద్దకాల
మవని పాలించి దివి కేగి నంతనుండి
రాజ మహిళలు పోవరు రోజు రోజు
బుద్ధమూర్తికి మలుసంజ పూజసేయ.
ఆలయమందు దివ్వె వెలు
    గందుట తప్పనె బిందుసార భూ
పాల కుమారు డప్పటి నృ
    పాలుడు; బౌద్ధ మహాప్రబంధముల్‌
కాలిచివైచె; నెత్తుటి క
    లమ్మున పైతృక శాసనావళిన్‌
వాలుపు గీతలన్‌, కరకు
    వారిన చేతల కొట్టివైచెనున్‌.
మానసమందు భక్తి ఘన
    మై తగ, పుణ్యనదీ జలమ్ములన్‌
స్నానము చేసి రాణి పరి
    చారిక 'శ్రీమతి' ఫుల్లమల్లికా
సూన మనోజ్ఞ మాలికలు,
    చుక్కలవోని ప్రదీప కోరక
శ్రేణులు పైడి పళ్ళెమున
    జేరిచి రాణిని చూడ వచ్చెనున్‌.
"బుద్ధ దేవాలయమునకు పూజ సేయ
పోవు వారికి మరణశిక్షా విధంబు
వినుమి రాజాజ్ఞ యిది" యని వినిచె, మేను
జలదరింపగ శ్రీమతీ సతికి రాణి.
రాణికి నమస్సు చేసి పారాణ చెడని
కొత్త పెండ్లికూతురు రాచకొమరు భార్య
'అమిత' యుండెడి సౌధాన కరుగుదెంచె
శ్రీమతి, ప్రబుద్ధ భక్తిమచ్ఛ్రీమతి యయి.
తొడపయి జాళువా మెరుగు
    తొన్కెడి అద్దము నుంచి, చొళ్ళెపున్‌
ముడి విడవైచి, పాపటను
    ముక్కుకు సూటిగ తీసి, కస్తురీ
తిలకము భాగ్య చిహ్న మటు
    దిద్ది మొగమ్మున, నవ్వుచున్న అ
ప్పుడు 'చమితా లతాంగి' భయ
    పడ్డది శ్రీమతి జూచి నంతనే.
"కత్తి మెడపైకి తెచ్చితి కాదె! ఏమి
ఈ భయంకర బుద్ధ పూజా భరంబు!"
అను చమితభీతి 'అమిత' వాకొనుట చూచి
శ్రీమతి చనె శుక్లకుమారికను చూడ.
కిటికీ చెంత దినాంత శాంత రవి రుక్‌
    కిర్మీర కాంతిన్‌ పుటం
బుట శృంగారపు కావ్యమున్‌ చదువుచున్‌
    మోహావమగ్నాంతరో
త్కట తాపోచ్ఛ్వసనమ్ములన్‌ జెలగు శు
    క్లాదేవి భీతిల్లి వా
కిట పూజాతుర శ్రీమతిన్‌ గనగనే
    కేల్జార్చె కావ్యమ్మునున్‌.
"ఓసి! ఇది యేమె? యౌవనాభ్యుదయమైన
నీ వయసు మిత్తి కాహుతి కావలెసెనె?"
అనుచు శుక్లాకుమారిక గొణుగుట విని
విసిగి శ్రీమతి రాణుల విడచి పోయె.
"రాజమహిళా లలామలు! పూజ సేయ
మోజు కలదేని లెండు, నోముకొన రండు
బౌద్ధ దేవాలయమునకు వచ్చి పొండు"
అనుచు శ్రీమతి యెలుగెత్తి అరచుచేగె;
కొందరు నవ్వినారు గృహ
    కుడ్యము పైపయినుండి తొంగుచున్‌,
కొందరు గేలి చప్పటలు
    కొట్టుచు మూసిరి తల్పురెక్కలన్‌;
చందనమున్‌ సుమమ్ములును
    చక్కని చుక్కలవోని దీపికల్‌
తొందరసేయ ఆలయము
    త్రోవన శ్రీమతి పోవ సాగినన్‌.
రాజ శుద్ధాంత గోపురాగ్రాన అపర
భాస్కరుని తుది కిరణమ్ము వాడిపోయె;
వాడ వాడల నీడలు ప్రాకి పోయె;
అపర సంధ్యా మహాపూజ కయ్యె సమయ
మనగ జేగంట మ్రోగె శివాలయాన;
సమసె కోలాహలమ్ము నిశ్శబ్దమందు.
శారద రాత్రి నిమ్న హ్రద
    సన్నిభమై కనుపట్టె; వెల్గులన్‌
తారలు తేరి చూచె విను
    దారుల; బుద్ధ నికేతనమ్మునన్‌
బారులు దీరి దివ్వె లగు
    పట్టెను చీకటిలోన; రాడ్భటుల్‌
పారుచు పోయి రుక్కు కర
    వాలము లొక్కతరిన్‌ తళుక్కనన్‌.
"మృతికి జడియనిదాన వెవ్వతెవె నీవు?"
అని అరచినారు భటులు - తీయని స్వనంబు
"శ్రీమతిని, బుద్ధదేవార్పితామృతాంత
రాత్మ దీపికాంకూరము" ననుచు వినిచె.
యెర్రవారెను శ్రీమతీ హృదయ రుధిర
సిక్త ధవళస్ఫటిక శిలాసీమ; మలిగి
పోయె నిశ్శబ్ద తారకాచ్ఛాయలందు
దివ్య బుద్ధాంత్య పూజా ప్రదీప కళిక.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - SrImati - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )