కవితలు దాశరథి కవితలు అగ్నిధార
25. క్షమామూర్తి
 
హిమగిరి శిఖాముఖాన వెల్గించినావు
దివ్య దీపాంకురము; దేశ దేశములకు
యుగ యుగమ్ముల చీకటు లుడిగిపోవ
గుండెలోనుండి నెత్తురుల్‌ పిండిపోసి.
నలుబది కోట్ల భారత జ
    నమ్ముల వందలయేండ్ల బంధన
మ్ములు సడలించినావు, జయ
    ముల్‌ గొనినావు, త్రివర్ణకాంతులన్‌
తళతళ లాడు భారత ప
    తాకము నాకము తాకుంత యె
త్తుల కెగయించినావు; పగ
    తుర్‌ కొనియాడగ పెంచినాడవున్‌.
మతముల గ్రుద్దులాటలను
    మాన్పు ప్రతిజ్ఞలతో ప్రజా సమే
కతకయి ప్రాణ మొడ్డిన మ
    హాత్ముడ వీవు; భవిష్యకాల సం
తతు లఖిల ప్రపంచ జన
    తా నయనాంచలవీధి నీ మహో
న్నత దరహాసమూర్తి పయ
    న మ్మొనరింప దృశించ జాలరే!
కాలసవిత్రి వందల యు
    గమ్ముల భీషణ గర్భవేదన
జ్వాలలలో సుఖప్రసవ
    సౌఖ్యము నందెను నీవు భూమిపై
కా లిడగానె; భారత జ
    గజ్జననీ నయనాల నెత్తురుల్‌
జాలయిపారె నీవు దివి
    షత్పుర మార్గములందు కాలిడన్‌.
పల్లెల గొల్లవాడవయి
    పాలను త్రావెదు; ధోతిగుడ్డ మో
కాళ్ళను దాటనీయ; వొక
    కఱ్ఱను చేతికి నూతజేసి ఊ
ళ్ళూళ్ళకు శాంతికుంభము భు
    జోపరిభాగముపై, అహింసయన్‌
చల్లల నమ్మబోయెదవు,
    స్వామి! నరాకృతి సత్యదైవమా!
నీల నీలాకాశ ఫాలభాగము నుండి
రవిబింబ కుంకుమచ్ఛవులు రాలె
భూదేవతా రమ్య పాద మంజీర శిం
జా గుంజనమ్ము లశ్రావ్య మయ్యె.
స్వాతంత్ర్యకన్యా నవన్నవ వైవాహ
వేదిపై నెదొ దుఃఖ నాద మలరె
లోకకంటక జనానీక ఘూక వికార
హేళన ధ్వనులు విన్పింపసాగె
చేతులారగ నీవు పెంచిన స్వతంత్ర
నాగవల్లికయే విషనాగ మయ్యె;
నీ గళము చుట్టి ప్రాణాలు లాగివేసె,
భారతీయుల గౌరవ ప్రతిభ మాసె.
(1948 జనవరి 30 వ తేదీన నిజామాబాదు జైలులో రచితము)
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - xamAmUrti - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )