కవితలు దాశరథి కవితలు అగ్నిధార
23. రారమ్ము!
 
మనసు క్రోధాన బండవారినపు డెల్ల
కనికరపు వాన జల్లుతో కదలి రమ్ము!
స్వాంతమందు కారుణ్యంబు సడలు నెడల
అమరగానముతోడ న న్నరసి పొమ్ము!
దేశ సేవా మహామోఘ దీక్షలోన
అలసి, సొలసి, అశాంతితో కలత జెంది
పెను చిరాకున గాభరా గొనెడువేళ
రమ్ము విశ్రాంతితోడ, శాంతమ్ముతోడ!
ముగుద బిచ్చపుటెద ఇల్లు మూతవైచి
ముసుగు సవరించి మూలన మూల్గునపుడు
నా మహారాజ! రాజమానప్రభావ!
తలుపులు తొలంగద్రోచి తొందరగ రమ్ము!
కోరికలు నా మనస్సును గ్రుడ్డిజేసి
దుమ్ము పైబోసి నేలకు ద్రోయునపుడు
నా ప్రణయమూర్తి! అంబువాహ ప్రకీర్తి!!
మెరపుతోడ, ఉరుముతోడ, తరలిరమ్ము!
(రవీంద్రుడు)
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - rArammu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )