| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 39. శ్రమికజాతి | |
|
తర తరాల దరిద్రాల బరువులతో కరువులతో క్రుంగి క్రుంగి కుమిలి కుమిలి కష్టాలకు నష్టాలకు ఖైదులకూ కాల్పులకూ సహనంతో శాంతంతో బలిపశువై తలవాల్చిన దీన పరాధీనజాతి శ్రమికజాతి దెబ్బతిన్న బెబ్బులివలె మేల్కొన్నది మేల్కొన్నది. | |
|
విశ్వవిపణి వీథుల్లో చావు చాల చవకైనది బ్రతుకుకు బ్లాక్మార్కెట్ధర. వ్యాపారులు ప్రపంచాన్ని తుంచుకొని పంచుకొని పరిపాలిస్తున్నారు. రైతు కూలి ప్రజ లంతా ధనికుల పాదాల క్రింద చీమలవలె చితికినారు. | |
|
శ్రమజీవుల రక్తధార జలంకన్న పలచనైంది. పరతంత్రత దరిద్రత గిరులవోలె పెరిగినాయి. శాంతానికి సహనానికి దహనక్రియ జరిగింది. | |
|
చెలియలి కట్టలు దాటిన ప్రళయకాల జలధి వోలె తిరుగుబాటు పరచుకుంది. | |
|
విశ్వ రుద్ర ఫాలంలో విప్లవాక్షి విరిసింది. పరతంత్ర ప్రజాకోటి ప్రళయవృష్టి కురిసింది. స్వాతంత్ర్యోద్యమ శంఖం దిగంతాల మొరసింది. | |
|
పొగులుతున్న భూగర్భం -- పగులనున్న జ్వాలాముఖి -- చిచ్చంటిన స్నిగ్ధాటవి -- పిడుగు లురలు పెను మేఘం -- హరగళగత హలాహలం శ్రమికజాతి కదిలింది. | |
|
ప్రజాద్రోహి వర్గానికి లయకాళిక శ్రమికజాతి -- జగద్విప్లవ గళంలో జయమాలిక శ్రమికజాతి -- మేల్కొన్నది మేల్కొన్నది. | |