కవితలు దాశరథి కవితలు అగ్నిధార
38. నిరుపేదా!
 
తరతరాల దరిద్రాల
బరువులతో పరువెత్తే
నిరుపేదా! విరుగుతోంది
    నీ మెడ
పెరుగుతోంది నీ గుండెల్లో
    దడ
బరువులతో శిరసు వంచి
పరువెత్తుటె బ్రతుకని
బ్రహ్మరాత యని
భ్రమ పొందిన
ధోకా చెందిన
నిరుపేదా!
శ్రమ విలువను గమనించని
అమాయకుడ!
అన్నార్తుడ!
నీ ఘర్మంలో
    భర్మం --
స్వేదంలో
    ప్రాసాదం --
రక్తంలో
    మౌక్తికాలు --
వెలిశాయని తెలియక
ఆకలె లోకముగా
శోకమె లోకముగా
మెతుకే బ్రతుకుగా
వెతికే పతితుడ!
బాట తప్పిన పాంథుడ!
నిన్ను బంధించి
అంధుణ్ణి చేసిందీ లోకం.
నీ పిల్లల నిల్లాలిని
కిల్లీమాదిరి నమిలే
మిల్లు మ్యాగ్నేట్లు --
నీ వేడి వేడి నెత్తురుతో
'షవర్‌బాత్‌' తీసుకునే
భువనైక ప్రభువులు --
వారంతా ప్రభువులు!
    అభవులు!
నిరుపేదా! నేను కూడ
నీకోసం ఆకలితో
చచ్చేనా!
నాకలాన్ని రూకలకై
అమ్ముకొచ్చేనా?
తరతరాల బరువులతో
విరుచుకపడు నిరుపేదా!
నిరీక్షించు
దివ్య నవ్య భవితవ్యానికి,
నిరీక్షించు.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - nirupEdA - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )