| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 40. అదుగో! | |
|
అదుగో! అదు గదుగో! ఉదయ దిశా వదనంలో కదిలే, మెదిలే తెల తెల్లని తళుకులలో -- నిశాంతాన నశించిన విశాల తారకామండలం ప్రశాంత మృతి సిత ద్యుతులు! | |
|
లోకపు చీకటి చీరెకు ఆకాశం రైకమీది చిక్కని చుక్కల పువ్వులు తళుకు పెట్ట గలిగేనా? జరీ అంచు మెరిసేనా? | |
|
దిక్కులేని పేదవాళ్ళ డొక్కలలో పిక్కటిల్లు ఆకలిమంటలతో నరనరాల పరుగెత్తే మెరుపు తీగె లరు గరుగో! విద్యుద్దీపాల్లో లండన్, వాషింగ్టన్ నిండు రాజవీథుల్లో వెండి కరిగిపోస్తున్నై; చుక్కలనే వెక్కిరించివేస్తున్నై. | |
|
మజ్జిగ పజ్జొన్నకూడు; కాకుంటే సజ్జబువ్వకోసరమై లజ్జ విడిచి, చిరిగిన చీరెలతో ముజ్జగాలు తిరిగే పేదల ఎంగిలి మెతుకులు దొంగిలించి బంగారం పొంగించిన ధనికుల మ్రింగాలని దొంగచాటుగా కాలం తొంగి చూచె నదు గదుగో! | |
|
హిట్లర్, ముసోలినీలు ఆట్లీ ట్రూమన్ల గొంతులతో ఓట్లడిగి ప్రభువులై కోట్లాది పేదల ప్రాణాల్తో చీట్లాడి మాట్లాడితే, బాయ్ నెట్లు చూపి, ఎన్నాళ్ళు! | |
|
అంతరాసియా గొంతు విచ్చి పంచానన పాంచజన్య గర్జానిధ్వానం చేసిం దదు గదుగో! | |
|
విను అదుగో! | |