కవితలు దాశరథి కవితలు అగ్నిధార
36. అంతర్నాదము
 
నా గీతావళి ఎంత దూరము ప్రయా
    ణం బౌనొ; అందాక ఈ
భూగోళమ్మున అగ్గిపెట్టెదను; ని
    ప్పుల్‌ వోసి హేమంత భా
మా గాంధర్వ వివాహ మాడెదను; ద్యో
    మణ్యుష్ణ గోళమ్ముపై
ప్రాగాకాశ నవారుణాస్ర జలధా
    రల్‌ చల్లి చల్లార్చెదన్‌.
వీణియ తీగపై పదను
    పెట్టిన నా కరవాలధారతో
గానము నాలపించెద, స్వ
    కంఠము నుత్తరణం బొనర్చి స్వ
ర్గానకు భూమినుండి రస
    గంగలు చిమ్మెద; పీడిత ప్రజా
వాణికి 'మైక్‌' అమర్చి అభ
    వాదులకున్‌ వినిపింప జేసెదన్‌.
తీతువు పిట్టనై చని ప్ర
    తీపుల ఇంట అమంగళ ధ్వనుల్‌
చేతును; కోకిలా గళము
    చించి వసంతము దొంగిలించి వ
ర్షా తరుణమ్ములో జలద
    రావముతో శ్రుతి మేళవించి చిం
చా తరుశాంఖికాంతర ని
    శాంతమునందున పాట పాడెదన్‌.
ఆకసములోని చుక్కల నాదరించి
ఆకలికి యేడ్చు డొక్కలనార్చి పిలిచి
తిరుగబడెదను భూమి బొంగరముమీద,
ధగ ధగని మండు లోకబాంధవుని మీద.
ఈ శ్మశానవాటి, ఈ నిశానైల్యమ్ము
లీ మహాశిశిరము లెన్నినాళ్లు!
ఈ క్షుధాజ్వరంబు లీ వ్యథాభారంబు
లీ బికారి బ్రతుకు లెన్ని నాళ్లు!!
గదులు గదులయి అరలయి ప్రిదిలి చిదికి
బ్రదుకు విలువలు నశియించి పాడువడిన
నేటి స్వార్థప్రపంచము నిండ విప్ల
వాగ్నుల తుఫాను లేపి శూన్య మొనరింతు.
హాలహలమును వడబోసి అమృతధార
తేర్చి త్రాగి త్రేన్చెద; యువతీ కపోల
ఫల రాగమ్ముపై బాల భానువులను
రంగరించెద ప్రత్యూషరంగమందు.
మానవుల నెత్తురులు త్రాగు మానవులును
దానవులెగాక మానవత్వంబు కలదె?
దానవుల నంతమొందింప నేను కూడ
రామ కృష్ణావతార ధారణము సేతు.
ప్రాణులను కోట్లు కోట్లుగా వాతగొనెడి
మృత్యువుకు భర్త నేను; బలిష్ఠమైన
నా నరాలతో మృత్యుకన్యకను పిండి
కోట్ల పిల్లల పెట్టించుకొందు నేడు.
భయపడను వానగాలికి, వరదదెబ్బ,
కాకలికి, అశ్రువులకు, త్రేతాగ్నికేని;
వెలుగు చీకట్లమధ్య తప్పించుకొనుచు
భండన మొనర్చు దివ్యకోదండి నేను.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - aMtarnAdamu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )