| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 37. కవితాకోపం | |
|
పాడను, పాటలు పాడను వాడను, పదాలు వాడను వేడను, దేవుళ్ళను దెయ్యాలను వేడను. ఓడను, రాజుకు ధనరాజుకు రారాజుకు ఓడను గోడను, ధనవంతుల కనక సౌధ మున కివతల వణకే నిరుపేదల అడుసు గుడిసె గోడను. | |
|
నన్ను చూచి ఎందుకొ మిన్నాగులు ఇట్లా పారాడుతు జీరాడుతు వస్తుంటాయి? | |
|
నన్ను చూచి ఎందుకొ పున్నాగలు ఇట్లా తారాడుతు, గోరాడుతు పూస్తుంటాయి? | |
|
ఇది లోకం నరలోకం నరకంలో లోకం నరలోకం. | |
|
ఏనాడో తెలుసు నాకు ఈ నిరీహ నీరవ నిస్స్వార్థ నిర్ధన నీచ నీచ మానవునికి నిలువ నీడలేదు జగతి. | |
|
లేదు లేదు విలువ లేదు రక్తానికి ప్రాణానికి శ్రమకూ సౌజన్యానికి రచయితకూ శ్రామికునికి రమణీ రమణీయ మణీ హృదయానికి విలువలేదు, విలువ లేదు. | |
|
పుండువడిన గుండెలతో నేను కూడ ఒక గుండానై పుండువడిన గుండెలతో మొండివడిన కండలతో మొండివడిన గుండెలతో పుండువడిన కండలతో పుండువడిన గుండెలతో దౌర్జన్యం చేయాలేమో! సార్జంట్లనె దోయాలేమో! | |
|
ధూర్జటినై మార్జిన్ వేయాలేమో! ఈ ధనార్జనా పర పరపీడాకర నిరుదార నిరంకుశ నీరస నిస్తేజ లోకానికి మార్జిన్ వేయాలేమో! ఫాలనేత్ర విలయాగ్ని మాలతో నీలగాత్ర విషనగ్నకీలతో. | |