| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 35. "ముస్సీ" తటము | |
|
అచట ప్రాక్పశ్చిమాకాశ మావలించి నెత్తురులు కక్కుకొన్నది; కుత్తుకలకు కత్తులను కట్టి ఊరేగు కాలరాజ్ఞి మాన భంగాల జండాలతో నటించె. | |
|
అచట, పాపము, దౌర్జన్య మావరించి తెలుగుదేశాన నెత్తురుల్ చిలికి వేసె; మత పిశాచము పేదల కుతుక నమిలి ఉమ్మి వేసెను పిప్పి, లోకమ్ముమీద. | |
|
నా తెలంగాణ కోటి రత్నాల వీణ తీవియలు తెగి, విరిగి నందించకుండె; నా తెలుగుజాణ ప్రాణ మానాలు దోచి ఈ నిజాము పిశాచి కన్నెఱ్ఱచేసె. | |
|
మా నరాల నెత్తురు, ప్రవాహాన కలిసి "ముస్సి"లో పారినది; బుద్ధమూర్తివోలె మా స్థిరీభూత భావసమాధి వృక్ష మట్లె నిలిచిన దీనాటికైనగాని. | |
|
గెలిచినది గడ్డిపోచ; ముక్కలయిపోయి మన్ను కరచెను గొడ్డలి; కన్నులోని వేడి అశ్రువు గెలిచెను; వాడి కత్తి ఓడిపోయెను; 'ముస్సి' పారాడిపోయె. | |