కవితలు దాశరథి కవితలు అగ్నిధార
41. ప్రాగ్భూమి
 
పడమటి బొల్లి గద్దలు
పొడిచి పొడిచి తిని విడిచిన
అగ్నిసంస్కారం నోచని
నగ్నశవం ప్రాగ్భూమి.
మతాలతో గతాలతో
చితి రగిల్చి పడి చచ్చే
అన్నాదమ్ముల చల్లని
కన్నతల్లి ప్రాగ్భూమి.
కరువుల తెరచాటున
మరణాంగ నాలింగనంలో
కను మూసిన నిరుపేదల
ప్రణయశాల ప్రాగ్భూమి.
తీగె విడిన దివ్యవీణ
మూగవడిన నాగస్వరం
కదలని వదలని అంతః
కదనపథం ప్రాగ్భూమి.
బూజెక్కిన కీలుబొమ్మ
రాజులపై జాజు పూసి
తాజాగా అమ్మిన అంగడి
బాజారిది ప్రాగ్భూమి.
లక్షలాది పేదల ప్రాణాల్‌
అక్షింతలుగా చల్లుకొన్న
లక్షాధికార్ల పాలిటి
లక్ష్మిదేవి ప్రాగ్భూమి.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - prAgbhUmi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )