కవితలు దాశరథి కవితలు అగ్నిధార
29. అస్తమయంలో
 
నేను పడమరలోకి చూస్తాను - రోజు
కుంగిపోతున్న సూర్యుని గుండెలోని
వెలుతురులు తాగి, చీకటి కలలు లాగి
రాత్రి సాంతము నిద్దుర రాదు - రోజు
ఈ నిశా ప్రాంగణాన అద్దించినారు
పాడు నెత్తురు రంగు, దేవతల స్త్రీలు
వాళ్ళ కనుకోనలందు నివాళు లెత్తి
వెళ్ళిపోతాడు సూరీడు పిల్లవాడు!
ఒకటి తరువాత ఒక దినమ్ము కదలాడి
ఓడి పోతుంది నాముందు; పాడుపడిన
పాత కాలము, రానున్న లేత కాల
మునకు నెత్తురు రంగు చందనము రాయు.
పూట పూటకు బుక్కెడు కూటికొరకు
పాటుపడు పేదవాని ఆరాటమందు
రాజభవనాలు, మన్మధరమ్యమూర్తి
చారు శృంగారకథలు, కంగారు పడును.
నేను వ్రాసిన మాత్రాన వాన కారు
రాక పోదు, తుఫానులు తేకపోదు;
నేను వ్రాయని మాత్రాన కానరాక
పోదు అస్తమయాన సూర్యోదయమ్ము.
నెత్తురులు పోసి ప్రాణాలు నింపవచ్చు
నెత్తురులు పిండి అసువు పో నొత్తవచ్చు;
లయ మహా హోమ వీతిహోత్రమ్మునందు
సృష్టి సుందరదేవి కన్పింప వచ్చు.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - astamayaMlO - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )