| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 30. హిమజ్వాల | |
|
మాపు సాంతము కురిసిన మంచులోన రేపు సాంతము మంటలు రేగునంట! కప్పుకొన దుప్పటీ లేని కవి కలాన గప్పుమని నిప్పుమంటలు క్రమ్మునంట! | |
|
ఏమహామహుడో ప్రజాహితము కోరి మున్ను చనిపోయె; నాతని మూర్తి చూపి మా ప్రజల ఆకళులు మాన్పుమాట కల్ల; మంచులో అగ్నిశిఖ మాటు మణగబోదు. | |
|
ఎవ డెరుగు పరిణామమే ఈ జగత్తు ప్రాణ మని? ఎవ్వడెరుగు నిష్ప్రాణమైన పాతకాలంపు రాతి స్తంభాలనీడ కోటి రాచరికాలు దిక్కు దెస లేవు? | |
|
నా చెవులలోన రుధిర వీణా కఠోర ఘోర ఝంకార మేల డాగుకొన జూచె నో! నిశా హిమానీ తరుణీ నితంబ లంబివేణిక నగ్నిపుష్పంబు లేలనో! | |