కవితలు దాశరథి కవితలు అగ్నిధార
43. ఖేదం
 
బరువైన వర్షాకాలం
కురిసిన వర్షాలతోటి
కరువులు దిగి వచ్చినవో!
చెరువులు తెగి విచ్చినవో!
నిరుపేదా! దరి లేదా
నరకానికి ఈ నరలోకానికి?
వ్రణాలకు రణాలకు
మరణాలకు
మాన ప్రాణ హరణాలకు
హద్దూ పద్దూ వుండని
కరకు నృపతి రాజ్యంలో
నిరుపేదా!
చిరఖేదం విరమించుక
బ్రతికేమో?
కడుపు నిండ గంజినీళ్ళు
గతికేమో?
సౌఖ్యానికి సఖ్యానికి
వెతికేమో?
ఏమో!
పేలిన తారాగోళం
రాలిన కన్నీటిచుక్క
కాలిన ఈ కడుపుఘోష
కూలిన పర్వత శిఖరం
ఈ వేదన కుదుటపడుట
జరిగేనా?
నిరుపేదా
చిరఖేదాగాధ
మహాంబుధి విరిసిన
బడబానల పద్మంలో
వెలిసే విప్లవబ్రహ్మ
నవజగత్తు పుట్టిస్తాడో!
భవజగత్తు గిట్టిస్తాడో!
నిరుపేదా!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - khEdaM - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )