కవితలు దాశరథి కవితలు అగ్నిధార
9. ఎండలు
 
తన నీడలో తానె కునికిపాటులు పడు
    ఇఱ్ఱి గుండెల యెండ లెఱ్ఱనయ్యె
పచ్చ పచ్చని ఆకు బ్రతుకు చూడగలేక
    మఱ్ఱిపండుల కన్ను లెఱ్ఱనయ్యె
పై నుండి నీటి రాబడిలేక సెలకన్నె
    చిక్కుచు శల్యావశిష్ట యయ్యె
కౌగింటి వేడిలో క్రాగిన మేనికి
    శీతోపచార మాశ్లేష మయ్యె
నిప్పు పువ్వుల మోదుగుకొప్పులోన
అడవిజడ యెల్ల ముడివడి అణగియుండె;
ఎండిపోయిన వాగుల నిండిపోయె
నెండమావులు గ్రీష్మంపు టెండలందు.
చలిచలి పోయి గాడుపులు
    సాగిన వేడుపుతోడ వేడి యూ
ర్పులను వెలార్చుచున్‌; గహన
    ముల్‌ దహనమ్ముల బిల్వసాగె, మా
వులు కుసుమింపసాగె, వల
    పుల్‌ ప్రసవింపసాగె, డొక్క 'లా
కలి, కలి, అంబలీ' అనుచు
    క్రమ్మర కేకలు వేయసాగెడిన్‌.
శీతవ్రాత క్రకచముల కోతవడిన
నా నరాల కగ్గిని వెట్ట బూనినాడు
పాడు టెండకాలపు దుండగీడు; నన్ను
పాడుకోనీడు పూవుల జాడలందు.
శీత మేగగానె చిచ్చు లేతెంచును
చిచ్చు లేగినంత చెట్టు మిట్ట
గట్టు పుట్ట కలిపి కొట్టెడి జడివాన
లరుగుదెంచు, గుండియలు ద్రవించు.
ఏమిటో ఈ జగత్తు! సహింపరాని
షడృతు గుణమిది; జీవిత స్వర్గ మెల్ల
నరకమైన విషాద మానవుడు వీడు;
నరపతుల కెల్ల ఘోరదానవుడు వీడు.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - eMDalu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )