కవితలు దాశరథి కవితలు అగ్నిధార
33. ఇందుపుర దుర్గము
 
ఇది చరితాత్మకం బయిన
    ఏ మహితాలయమో! ఇదే మహా
కదనము కోసమై మలచి
    కట్టిన దుర్గమొ! భారతీయ సం
పదలను కొల్లగొట్టిన న
    వాబుల గూబలు గుఁ య్యనన్‌, బదా
బద లయి పో\న్‌ మరాటి భట
    వర్గము లొత్తిన శంఖపుంఖమో!
ఇచట శివాజి వాజి యొన
    రించిన హేషలు నేటికిన్‌ గుహా
నిచయములందు గాలి పయి
    నించుటతో వినిపించు; వేద ని
ర్వచనము చేసినారలు ధ
    రాసురవర్గము రాఘవాలయ
ప్రచుర తరాంగణమ్ముల, వి
    పంచిక మ్రోసిరి సామగానమున్‌.
నశియించెన్‌ రఘునాథయోధుని దివా
    ణమ్ముల్‌; మహారాష్ట్ర వీ
ర శివాజీ గురు రామదాస రసనా
    గ్రవ్యగ్ర మంత్రౌఘముల్‌;
నశియించెన్‌ రఘురాము దేవళము; లీ
    నా డీ నిజాం రాక్షసీ
నిశితాసిన్‌ బడి బందిఖాన యయి క
    న్పించెన్‌ వికారమ్ముగా.
ఒక కాలమ్మున ఇద్ది దేవళము; వే
    రొక్కప్డు దుర్గంబు; నే
డకటా! జైలయి కానుపించెను; భవి
    ష్యత్కాలమం దెట్టి రూ
పకము\న్‌ దాల్చునొ! కాలచక్రగమన
    స్వాభావికావర్తక
ల్పకమై విద్యల కాలయంబె యగు నీ
    బందీలె పాలింపగన్‌.
ఇట మరాటీ జోదు పట పట కొరికిన
    పండ్లలో గోల్కొండ గుండ్లు నలిగె;
ఇట మరాటీ జోదు చిటిక వేయుటతోనె
    ఔరంగజేబు కంగారు పడెను;
ఇట మరాటీ జోదు కటి బిగించుటతోనె
    గగన భూ మార్గాలు కట్టువడియె;
ఇట మరాటీ జోదు గుటక మ్రింగుటతోనె
    తురక భూపతుల నెత్తురులు తరిగె.
ఇట మరాటీలు స్వాతంత్ర్య పటహములను
మ్రోసినారలు, రాజ్యాలు చేసినారు
ఇట స్వతంత్ర పతాకాల నెత్తినారు
కత్తి మొనతో దురాత్ముల మొత్తినారు.
ఢిల్లిలో భరతాంబ చేతులకు బే
    డీల్‌ వేసి బంధించి, లాల్‌
ఖిల్లాపై విషదంష్ట్రబోల్‌ శశి కళల్‌
    గీలించు జండా పటం
బల్లలాడ ప్రభుత్వము\న్‌ జరుపు నా
    డౌరంగజేబుండు నీ
ఖిల్లామీది శివాజికేతనము లా
    గింపంగ లేడయ్యె బో.
అల వింధ్యాచల సీమలన్‌ రణము సే
    యన్‌ బోయియున్నట్టి వీ
రుల గుర్రములు దప్పి దీర్చుటకు రా
    త్రుల్‌ రాత్రులే వచ్చి జీ
నుల తోనే రఘునాథ సాగరమునన్‌
    తోయమ్ములన్‌ ద్రావి పి
ట్టల వోలెన్‌ రణమందు దూకెను, మరా
    టా గుర్రముల్‌ గుర్రముల్‌!
అత డొక బ్రహ్మచారి, పర
    మాత్మకు నాత్మకు నేకతా, వియో
గతలను గూర్చి చర్చలకు
    కాలము పుచ్చెడివాడు; భారతీ
యత కపకారమున్‌ జరుగు
    నప్పుడు ఖడ్గము బూని మ్లేచ్ఛులన్‌
మెతిపె మహామహుం, డతని
    నే రఘునాథు డటండ్రు లోకులున్‌.
అమితోత్సాహమునన్‌ పురాతన చరి
    త్రాంకమ్ముల\న్‌ జూడ ప
శ్చిమ చాళుక్య మహాంధ్రతేజము వికా
    సించె\న్‌ ప్రభాతారుణా
ర్యమ దివ్యద్యుతివోలె; ఇందుపుర దు
    ర్గద్వార తీరాల ఆం
ధ్ర మహారాష్ట్ర నృపాలు రెత్తి రసిధా
    రాపూర మిచ్చోటనే.
(నిజామాబాదు సెంట్రల్‌ జైలు)
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - iMdupuradurgamu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )