కవితలు దాశరథి కవితలు అగ్నిధార
32. మళ్ళించు రథము
 
ఓ నిరుపాథిజీవి! ఎపు
    డో నశియించెనురా ప్రశాంతి! ఈ
శానుని కంటిలో దశది
    శల్‌ మసి యైనవి, నీక్షుధార్త గ
ర్భాన దవానలమ్ము బడ
    బానల మగ్గల మయ్యె; నెన్నినా
ళ్ళీ నరకాన క్రుంగెదవు,
    లెమ్ము, సమాజము మార్చివేయగా.
ఈ సమాజాన దోపిడికే నివాస,
మిందు నీ కేమి లేదు; సహింపరాని
వేదనయె కాని వేరు కన్పింపబోదు
లే! చివాలున లేచి మళ్ళించు రథము.
ఈ ఉరిత్రాళ్ళలో బ్రతుకు
    లీల్గి శవాలయి వ్రేలుచుండె; ఏ
దో ఒక గోతిలోన పడ
    నున్నది ఈ జగతీరథమ్ము; లె
మ్మా! అడు సెక్కి వచ్చు కుటి
    లాధ్వము లందున నుండి త్రిప్పి వా
జ్రేయ పథాలలోన కద
    లింపుము లోక రథోరు చక్రముల్‌.
నీ నిరుపేద గుండె కరు
    ణించి ద్రవించి యుగాలనుండి ల
క్ష్మీ నిలయాలలోన నివ
    సించు కుబేరుల కెగ్గు సేయగా
బూనగ లేదు, నీ బ్రతుకు
    మూల్గులు పీల్చినగూడ సుంత కో
పానకు తా వొసంగదు, కృ
    పామతి! యెంతటి ఓర్పుకాడవో!
నీవే లోకమునిండ నిండితివి కా
    నీ, ఈ ప్రభుత్వాలు ని
న్నే వంచింప బలాలు కూర్చుకొనుచుం
    డెన్‌, భగ్నజీవీ! తుపా
కీ వర్షించెడి ఉక్కు గుండ్లు భవ ద
    గ్ని స్ఫార నేత్రాలలో
త్రోవల్‌ చేయుచు సాగలేక పరువె
    త్తున్‌ వెన్కకున్‌ వెన్కకున్‌.
నీ నయనాశ్రు శీతల ధు
    నీ పరివాహము భీకరాస్త్ర శ
స్త్రానల కీలలన్‌ గుటుకు
    మన్నది; తిన్నగ మ్రింగివేసి నీ
లోననె దాచుకొన్న, దెపు
    డో శివనేత్రము వోలె విచ్చి లో
కాన లయాగ్ని కీలికలు
    కప్పునురా! వినరా! కృశోదరా!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - maLLiMchurathamu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )