కవితలు దాశరథి కవితలు అగ్నిధార
34. వీరాంధ్రుడా!
 
పటు బాహాబలురైన ఆంధ్రుల గత
    ప్రాశస్త్యముల్‌ వల్లె వే
యుటలో కొన్ని తరాలు దాటినవి; పూ
    ర్వోదంతముల్‌ నేటి సం
కటముల్‌ తీర్పవుగాక, నాటి జ్వలితాం
    గారమ్ము లీనాటి కుం
పటిలో బూడిద కప్పుకొన్నవి, రగు
    ల్పన్‌ లెమ్ము వీరాంధ్రుడా!
ముక్కలు ముక్కలై చెదరి
    పోయెనురా! మనజాతి, హూణ భూ
భుక్కుల రాజనీతికి క
    వుంగిళు లొడ్డిన 'రాజు' చేతిలో
చిక్కెను కోటిమంది నివ
    సించెడి బంగరు తెల్గునేల, నే
డక్కడ తెల్గుటంగనల
    ప్రాణము, మానము దక్కకుండెడిన్‌.
నాటి మహాంధ్రరాట్‌ కరక
    నత్‌ కరవాల కరాళధార ఈ
నాటికి తెల్గువాని నయ
    నమ్ముల తళ్కులు పెట్టుచున్న దా
రాటము జెందుచున్నది, ప
    రాజితమైన తెలుంగునేల పో
రాటమునందు గెల్చుకొని
    ప్రాజ్య మహావిభవమ్ము లందగన్‌.
ఎత్తిన కత్తి డింపక జ
    యేందిర నందిన పూర్వు లాంధ్రరా
హుత్తుల నెత్తురుల్‌ మసలు
    చున్నవి తెల్గులగుండెలన్‌; పరా
యత్త మహాంధ్ర సంపద స్వ
    య మ్మొనరింపగ పోరు సల్పగా
వత్తురు స్త్రీలు సైతము, కృ
    పాణము లెత్తి జయింత్రు శత్రులన్‌.
తుంగభద్రానదీ భంగమ్ము లిరువాగు
    లొరసి పారుచు రుచు లరయునపుడు,
కృష్ణవేణీ తరంగిణి నాలుకలు సాచి
    ఇరుకెలంకుల 'మజా' లరయునపుడు,
గోదావరీ వీచికా దివ్యహస్తాలు
    దరుల రెండిట మన్ను తరచునపుడు
మలయాచలాధూత మధు సుగంధిలవాత
    పోతముల్‌ తెలగాణ బొరలునపుడు,
ఇటు విముక్తాంధ్రభూమి తీపెక్కుచుండ
అటు విషాక్తాంధ్రసీమ చేదై జ్వలించు;
ఇటు తెలుగుజాణ ముక్తిసౌహిత్య మూన
అటు తెలంగాణ దాస్య సంకటములోన!
భారతమాత ఈ తెలుగు
    పాపని బొజ్జన దాని కాచి దు
ద్వార మహోగ్రదాస్య విష
    బాధలు తాను భరించి, నే డిదే
స్వైరత నందగా, తెలుగు
    పాపడు వీడు స్వమాతృ భారతీ
స్మేరపతాక చేత గొన
    జెల్లదె ఈ తెలంగాణ భూములన్‌?
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - vIrAMdhruDA - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )