కవితలు దాశరథి కవితలు అగ్నిధార
21. త్రపామయీ!
 
ఊర్వశీ స్నిగ్ధ సౌందర్య ముబికి వచ్చు
మొగము చిటిలించి వణకెడు మోవినుంచి
అమృత పాత్రిక భయమున నంటిపట్టి
త్రావెదేల! ప్రేమమ్మును దాచెదేల!
తలపు కలదు; ఆ తలంపులో వలపు కలదు;
దానితో యౌవనంపు తొందరయు కలదు;
తొందరకు తోడు నేను నీ ముందు కలను;
దాచెదేల! ప్రేమమ్మును దాచెదేల!
ప్రాణమే లేని పాషాణ ప్రతిమలైన
ప్రేమ నెరుగనివారు దూరెదరో నిన్ను!
వెకిలిగా, నిన్ను చూచి, నవ్వుకొనువారొ!
వెరచి వారికి, నిను దాచి పెట్టెదేల!
చాటు చాటుగనే కన్ను గీటెదేల!
సహజమగు ప్రేమ, లేనట్లు చాటెదేల!
నీవు పేదల రక్తమ్ము ద్రావ లేదు;
నీవు హింసాక్రతువు లేవి నెరపలేదు;
ఏల పశ్చాత్తపించెద విటుల? నిండు
చెమటలో తానమాడెదు చింతతోడ?
మందిరాంతర పూజా సమాధి పరులు,
రమ్య శుద్ధాంత కాంతా విరాజమాను
లనుగమింపని రీతి నీయందు కలదు,
ఏల అరచేతిలో మోము వాలిచెదవు?
వన్నె బెట్టగ చిరుసిగ్గు చిన్నె కలదు,
గాయమున మాన్ప హృదయాన, కరుణ కలదు;
పాడుకొన ప్రేమగీతాలు గూడ కలవు
పెదవి పరదాలలో వాని నదిమె దేల?
రమ్ము! జాగుసేయగ సమయమ్ము లేదు!
మహిని కల వెన్నొ; ఒక్క ప్రేమమ్మె కాదు!
ఆత్మవిశ్రాంతి కిది యొక ఆశ్రయమ్ము!
భయము భయమున తెరతీసి వచ్చెదేల?
దాచెదేల! ప్రేమమ్మును దాచెదేల!
(కైఫీ ఆజ్మీ ఉరుదూ కవితకు అనుసృతి)
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - trapAmayI - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )