| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 17. సంధ్యాలయమూర్తి | |
|
లయసంధ్యా శివమూర్తి; హే ప్రలయవే ళా రుద్రమూర్తే! భవ న్నయన జ్వాలలో జరా మరణ బా ధా రాక్షసుల్ బూదియై పయనించున్; నవసాంధ్య పద్మకళికా ప్రత్యగ్రరాగోదయ ప్రియ గంగా శివమూర్తి; బ్రోవగను రా వే చంద్రచూడామణీ! | |
|
నాగావళీ దివ్య భోగ రాగమ్ముల బాహువల్లికలందు బడసినావు! హాలాహలాయాత కీలావళీ పూత గళమందు నీలమ్ము కట్టినావు; భంగ రంగానంగ శృంగార గంగాన దీ వారి కోకారి దింపినావు; ప్రళయాగ్ని నగ్నధారా కాంతిపూరమ్ము ఫాలభాగమునందు దాలిచితివి; | |
|
రుద్రమూర్తీ! భవద్రమ్య రుచ్య దేహ కాంతిలో అప్సరసలకే కన్నుకుట్టె; పార్వతీదేవి నీ దివ్యపాదసీమ తనదు యౌవన మెల్ల అర్పణము చేసె. | |
|
కాలికి గజ్జె కట్టికొని కావిమెఱుంగల సందె గద్దెపై మేలి గజాజినాంబరము మేన ధరించి అనేకరీతి నృ త్యాలను సేతువంట! తల యందలి ప్రేయసి నూచుదంట! సం ధ్యా లయమూర్తి! నాట్యకళ యందున లోకము మోసపుత్తువే! | |
|
నీ నీలాలక బంధ మందలి భవా నీ గాంగ రంగత్తరం గానన్ బాల శశాంకమూర్తి అమృత స్నానమ్ములన్ జేయు న య్యా! నీ కింకిణికా కుణుక్కుణు రవం బాలించి బ్రహ్మాండమే ఆనందమ్మున నృత్య మాడును మహా త్మా! నాగభూషావిభో! | |
|
నీ సుకుమార పాదముల నింగి కురంగధరుండు వెన్నెలల్ దోసిట బోసి తెచ్చి అమ రుల్ పులకింపగ తానమార్చు; వి న్యాస విలాస హాసముల నాట్యము చేసెడి నీ కరాంగుళీ ప్రాసములో అనంగుడు జ రామరణమ్ములు దక్కి నిక్కెడిన్. | |
|
కుడి హస్తమ్మున శూల మెత్తెదవు, ది క్కుల్ పిండిగా ఢక్క చ ప్పుడు గావింతు మరొకహస్తమున; ని ప్పుల్ గ్రక్కు నీ కంటిలో పిడుగుల్ పిల్లలు పెట్టుకొన్నవి; మహా మేఘావళీ గర్జనల్ గుడుగుంచమ్ముల నాడుకొన్నవి, శిరః కోకారి! నీ ఢక్కలో. | |