| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 7. రుధిరసంధ్య | |
|
పూచిన మోదుగుంబువుల పుక్కిటినుండి వసంతరాజు ర క్తాచమనంబుసేయు సమ యం బిది; సాంధ్యపరాగరాగ గో రోచన కాంతిపుంజిత వి రోచన లోచన రోచిరుజ్జ్వలం బై, చరమాచలాగ్ర శిఖ రాంతర దంతురమై చెలంగెడిన్. | |
|
ధుమధుమ లాడసాగినవి తూరుపుదారుల మోదుగుం బువుల్; బొమ ముడివెట్టి యాడినవి పొన్నలు, గన్నెరు కన్నె మొక్కలున్; ఘుమఘుమ లాడిపోయినది కుంకుమ పూ జవరాలు; మాధవీ ప్రమద యొయారియై నదికి పక్కగ మావిని కౌగిలించెడిన్. | |
|
వెచ్చని కంటినీటి నిక పిండెద నా కలమందునుండి; క్రొ వ్విచ్చిన మావిపూలు గురి వెట్టి అనంగుడు బాణమేసె; గో ర్వెచ్చని పారిజాతములు విచ్చెను యౌవనసీమలందు; నా బిచ్చపుగుండె ప్రేయసిని వేడును కౌగిలిభిక్ష పెట్టగా. | |
|
అగ్నిజ్వాలిక వోలిక నగ్నముగా నాట్యమాడు నవవాసంతో ద్విగ్న పలాశప్రసవా లగ్న జపాలక్త రక్తరమ కనిపించెన్. | |