కవితలు దాశరథి కవితలు అగ్నిధార
14. వానలు
 
భగ్గున మండు గ్రీష్మ ఋతు
    వాసర తాపము లొక్కమారుగా
తగ్గెను; వాన గాడుపులు
    తాకెను, సోకెను సన్నజాజి పూ
మొగ్గలపై తుషారములు;
    పొంగిన బంగరు చన్నుదోయితో
డిగ్గె విహాయసమ్మును త
    టిన్నటి నన్‌ వరియించుకోసమై.
మామిడి పూచి పోయినది,
    మాధవుడే అరుదెంచిపోయె, 'కూ
కూ' మధు కోకిలా, ప్రణయ
    కూజితముల్‌ వినిపించకుండె; ఆ
యామని శోభలే వరద
    లై పరువెత్తెను వానలోన; బా
లా! ముకుళాయమాన వకు
    ళమ్ములలో మకరంద మెత్తుమా!
జలదాదేశక వర్షధారలు ప్రవే
    శం బయ్యె విశ్వంభరా
తలి; శంపాలతికావితానములు రా
    ద్ధాంతమ్ముగా వజ్రదం
డ లయాఘాత జయప్రదర్శనము స
    ల్పన్‌ జొచ్చె; ఆకాశ వీ
ధులలో కొండలుదేరి పోయినవి యా
    దోనాధ గర్భాంబువుల్‌.
గుటగుట త్రాగివేసె చిను
    కుల్‌ భువి క్రక్కిన వేడి నెల్ల; ఆ
రటపడి మ్రగ్గిపోవు ఉద
    రమ్ములు చల్లవడెన్‌; తటిన్నటీ
కటక రటత్‌ సువర్ణ జయ
    ఘమ్టలు కింకిణికా ఝళంఝళో
త్కటమయి వీను సోకె, వడ
    గండ్లు బటాపట నేల రాలగన్‌.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - agnidhAra - vAnalu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )