| కవితలు | దాశరథి కవితలు | అగ్నిధార |
| 13. వసంత కుమారిరాక | |
|
నా వాసంత కుమారి వచ్చినది వీ ణా వాదనానంద సం ధ్యా వీచీ పరిజల్పిత స్తన యుగీ నాభి ప్రదేశాలతో; నా వాసంత కుమారి విచ్చినది పు న్నాగ ప్రసూనాంబర శ్రీవిన్యాసముతోడ నా కొరకు కాం చీ కింకిణీ నాదయై. | |
|
కంకణ కింకిణీ చకచ క ప్రణినాదముతోడ వచ్చి నా వంక నెదిర్చి చూచినది పంకజపాణి దృగంచలాన సా యం కమలాలయ ప్రసవ హాస విలాసము కానుపించె, సా లంకృత కన్యవోలె, రతి రాజకుమారిక వోలె చూపడెన్. | |
|
ఆయమ నా హృదంతర వి హాయస వీధుల కప్పుకొన్న జ్యో త్స్నేయ శశాంకమో? దశది శీ విశదోజ్జ్వల సుప్రభాత దే శీయ మనోజ్ఞరాగ రవి సింధుర బంధురకాంతి బింబమో? ఏ ఉపమానమున్ తొలక రింపదు నా హృదయోర్వరాతలిన్. | |
|
అట నివసింతమా! సఖి? న వారుణ పల్లవికా రసాల ని ష్కుటముల గూడు కట్టికొని కోయిల కూయిడుచోట, కోటి సం కటములు మాటువెట్టి, వడ గాడ్పుల యేడ్పులు దాటి, శీతలో త్కట జలపాత తీరముల కాలము వేలము వేసి, కొందమా? | |