| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 10. అగ్నికుంకుమము | |
|
ఓసి, కూలిదానా! నవాభ్యుదయ వేళ మంటి తట్ట నెత్తినబెట్టి మరుగులేని యెత్తు రొమ్మును పొంగించి యెందుకొరకు ఉస్సురనెదవో ఆకాశ ముడికిపోవ? | |
|
అంబర చుంబి సౌధముల కాయువు బోసెడి నీశ్రమప్రభా వంబు నెరుంగలేని ధనవంతుల బంగరు పళ్లెరాలలో అంబలిపోసి త్రావు సమయమ్ములు డగ్గరె లెమ్ము! నీ నవా స్యంబున రుద్రనేత్ర విలయాగ్నుల కుంకుమ బొట్టుపెట్టుమా. | |
|
వ్రాసి వ్రాసి పొత్తమ్ములు మాసి, నా క లమ్ములో సిరా ఇంకి రక్తమ్ము పోసి అరుణ తరుణాక్షరాల కావ్యాలు కూర్చి ఆకలికి మాడిపోయెద, నీకొరకయి. | |
|
'పేదను, ధర్మభిక్షమును పెట్టు' మటంచు, తపించుచున్న జీ ర్ణోదర మెత్తిచూప, తృణమో పణమో పడవేయ తృప్తితో పోదు రటన్న కాలములె పోయెను; పేదల రక్తమాంసముల్ గాదెల స్వర్ణమై నిలువగా, ధనవంతుని యాజమాన్యమా! | |
|
లేదు, లేదు చల్లారగా లేదు, పేద వాని గుండియలోని శ్మశాన వహ్ని; కాల్చివేయును, బంగారు గద్దె లెక్కి పేదలను సిగరెట్లుగా పీల్చువారి. | |