| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 11. సుప్రభాతం | |
|
ఓ నిర్భాగ్య నిరీహ నిర్బల నిరుద్యోగప్రజా! నీ భుజా గ్రానన్ వంద తరాల పేదతనముల్ రాళ్లెత్తె! శుష్కోదర శ్రేణుల్ కాలె క్షుధా శ్మశానముల! విచ్చెన్ వహ్నిపుష్మమ్ము లీ శానస్ఫార నిటాల భూమి నయనాంచద్వల్లికాగ్రమ్మునన్. | |
|
నాచేత రుద్రవీణా తంత్రి మీటించి ప్రాచీ దిశా రక్తరంజితోద్యానమ్ము లో చిన్ని కాలాగ్ని వల్లికను నాటించి వేచి యున్నది వచ్చుటకు భవిష్యద్దేవి | |
|
మీరు మీమీ నర నరమ్ముల మేటి పాటలు పాడుకోండి, మీరు మీమీ తర తరమ్ముల అనుభవమ్ముల వాడుకోండి. | |
|
నీలిదారుల కాలు మోపిన సూర్యదేవుని చురుకు చూపులు, నావి. | |
|
నావికుని బుజాల ఊపులు తోసి పారేస్తున్న నీళ్లకు తొణికిపోయే పడవ మీద చిన్నిసౌధం కట్టుకుంటా ... నేను. | |
|
మీరు ... ప్రజలారా! నిశా శంఖం ధ్వనించిన కటిక చీకటి గుండె శబ్దం వినండి, వినండి. | |
|
మీ నాగేటి కర్రు రుచి చూచిన భూమితల్లి పెదవుల తీపి చెబుతున్న సాక్ష్యం వినండి, వినండి. | |
|
ఈ భూమి మీది, ఈ సీమ మీది, కదలకండి వదలకండి, నరాలు, బొమికలు బలం చేస్తాయి! చావండి, కాని వదలకండి మీ భూమిని. | |
|
నాగటి చాళ్లలో నడిచే రైతులార! మీ నిశ్శబ్ద గళాలు పాడిన గీతా రహస్యాలను బధిర లోకానికి వినిపించే నా రుద్రవీణ, ఇదో! | |
|
కదలెను తూర్పు వాకిలి మొగాన బిగించిన తల్పురెక్క; భూ వదనమునందు కుంకుమము భగ్గున మండిన దగ్గివోలె; నా హృదయ కవాట మిప్పుడొనరించెడి చప్పుడు బట్టిచూడ, ఆ పద యేదియో తుపానువలె వచ్చునటుల్ కనుపించు నేలనో? | |