కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
09. ముక్త భూమి
 
అవి తెలంగాణమందు దావాగ్ని లేచి
చుట్టు ముట్టిన భీకరాశుభ దినాలు!
అవి నిజాము నృపాలుని అండ దండ
చూచుకొని నిక్కినట్టి పిశాచి కలలు
నాడు మానవతీ నయనమ్ములందు
నాగసర్పాలు తలలెత్తి నాట్య మాడె
నాడు మానవతా నవ నాగరకత
తన్ను తిన్నది రాక్షసత్వమ్ముతోడ.
భారత భామినీ నయనభాగ వినిర్గత రక్తబాష్ప శృం
గారిత కాల రాక్షసి వికావిక నవ్విన నిస్స్వనమ్ములో
తూరుపు ఊరుపున్‌ విడిచి తొందర పడ్డది తెల్లవారగా
ఘోర నిశా తమః పటల గుంఫిత నీల నభః పథమ్ములన్‌.
తరతరాల స్వప్నాల సుందర ఫలమ్ము
స్వైర భారత భూమి చూపడెనొ లేదొ
విషము గుప్పించినాడు, నొప్పించినాడు
మా నిజాంరాజు, జన్మ జన్మాల బూజు.
భారత మాతృ గర్భమున బల్లెము గ్రుచ్చిన దుండగీండ్ర కా
ధారముగా నిజాం నృపతి తాళముతీసిన పెద్దపెద్ద బం
గారపు బొక్కసాలు పసికట్టెను తెల్లదళారి! అంతలో
బేరముసాగె పోరు జరిపింప తుపాకులు దింపుకోసమై.
పరశు నిశాత ధారలను పచ్చనిగడ్డి యెదిర్చినట్లు, రా
చరికపు టుక్కు చట్టమున చల్లగ ధిక్కరణమ్మొనర్చె ను
స్సురనెడి పేదవాడు! కడుచోద్యము! వెచ్చగ స్నానమాడె సుం
దరతర భామినీ నయన ధారల భారత మాతృ పాదముల్‌.
కోటితెలుంగు లొక్క మొగి 'కో' యని పిల్చిన యంతలోనె ఆ
రాటము చెంది భారతధరా తలమంతయు సంచలించెబో;
కూటికి లేని పేదలకు గూడను పౌరుషమా! యటంచు స్త్రీ
కోటిని మానభంగములకున్‌ గురిజేసిరి ముష్కరాధముల్‌.
చల్లని మంచుకొండలు బుజమ్మున మోసెడి భారతమ్ము శాం
తిల్లె నిజాము నీల్గుడులు తేటపడంగలదాక! అంతలో
బొళ్లున కుండ బ్రద్దలయి పోయెను, భారతమాత డొక్కలో
కుళ్ళిన పుండు కోసి జయగోపురమెక్కె త్రివర్ణకేతనాల్‌.
దూరాననున్న చుట్టము
దూరాననె ఆగె! తెల్లదొంగ నభస్సం
చారి యయిపారె, స్వేచ్ఛా
భారత సైన్యమ్ము తలుపు బ్రద్దలు కొట్టెన్‌.
ఎదురెక్కి యున్న జలములు
నదులై చొదబారె నింటి నడుమన్‌; రాముం
డదనున బాణము వదలెను,
మదమణగెన్‌ మా నిజాము మారీచునకున్‌.
రెండు వందల యేండ్ల చరిత్ర పుటల
కప్పుకొని యున్న గాఢాంధకారమెల్ల
కొట్టుకొనిపోయె, తూరుపు మిట్టనుండి
పారివచ్చిన వెలుతురు వాగులోన;
మూడవపాలు తెల్గు పటమున్‌ తనపాలికి కత్తిరించు కొ
న్నాడు కదా నిజాము నరనాథుడు మున్నొక రెండుమూడు నూ
ర్లేడులనాడు! వాడు తొలగించిన ఆంధ్రమహాపతాక క్రీ
నీడలు నాగుపాములయి నేటికి కాటిడె వాని వంశమున్‌.
శ్రామికుని వేడి నిట్టూర్పులకు ప్రపంచ
మెన్నడో కాలి బూది కానున్న దేమొ!
లేనిచో అద్రి కానన శ్రేణులెల్ల
యెండవడ గాలి కిట్లేల మండి పోవు?
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - muktabhUmi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )