| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 02. మూర్ఛన | |
|
దొంతరలైన మబ్బులకు త్రోవలు చూపెడి మించుకాగడా చెంత మనోజ్ఞ కావ్యము రచించు కవిన్ ననుజూచి భావనా సంతతి నాగసర్పముల చాడ్పున వచ్చి నటించుచుండ వా యింతును రుద్రవీణ! నటియింతును పశ్చిమ దిక్తటమ్ములన్. | |
|
కుంతలముల్ కపోలములకున్ దగులన్, నయనాంచలమ్ములన్ దొంతరలై నవాశ్రువులు తొన్క ప్రతీక్షణలో నిశాదివం బెంతయు వంతతో కినియు నిద్ధమతిన్ ప్రియురాలి గూర్చి ప ల్కింతును రుద్రవీణపయి ఈహిత సాంత్వన గేయమాలికల్. | |
|
చింతల తోపులో కురియు చిన్కులకున్ తడిముద్దయైన బా లింత యొడిన్ శయించు పసిరెక్కల మొగ్గనువోని బిడ్డకున్ బొంతలు లేవు కప్పుటకు; బొంది హిమంబయిపోవు నేమొ? వా యింతును రుద్రవీణ పయి నించుక వెచ్చని అగ్నిగీతముల్. | |
|
గొంతుకలెండి, డొక్కలకు కొంచెము గంజియు లేకపోయినన్ పంతము నెగ్గగావలెను; ప్రాణము పోయినగూడ సమ్మెగా వింతు మటంచు ఆకట తపించెడి పేదల గూర్చి నేను మ్రో గింతును రుద్రవీణ; పలికింతును విప్లవ గీతికావళుల్. | |