కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
03. రససమాధి
 
పూవుల దారిలో యెడద పొంగులువార శరన్నిశా శశి
శ్రీ వలపించు చెంగలువ చేడియ కన్నులలో ప్రవాళ రే
ఖా విసరమ్ము తోచినటు కన్పడు నా అభినవ్య భావనా
దేవీ ముఖాగ్రరక్తిమ కుదించుకొనెన్‌ కవితా ప్రపంచముల్‌.
నా కవితా లతాంతము తృణమ్ములలో నయినన్‌ సువాసనల్‌
ప్రాకెడిరీతి పూచినది; ప్రాతదనమ్మును త్రావి త్రేన్చి నా
జూకగు క్రొత్తవాసనలు చూపిన దీ రసికాంధ్ర సాహితీ
లోకమునందు నంతట తళుక్కను వెన్నెల వెండి తీవలన్‌.
రస సమాధిని తన్మయిత సుమనస్సు
కాంచిన సురాంగనా కుచ కలశ లిప్త
దివ్య కస్తూరికా నీల దీప్తిలోన
గగనములు నృత్యమొనరింప గలవు కాదె!
అశ్రు బిందువు లందున విశ్రమించు
సప్త జలధి సంఘమ్ములు శక్తికొలది
హసిత చంద్రుని కని, పెంచి ఆకసమున
పెద్ద జేసిన దీ జగంబే హసింప!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - rasasamAdhi - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )