కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
08. వీర తెలంగాణము
 
ఓ తెలంగాణ! నీ పెదవు లొత్తిన శంఖ మహారవమ్ము లీ
భూతల మెల్ల నొక్కమొగి బొబ్బలు పెట్టినయట్లు తోచె; ఓ
హో! తెలవార్చి వేసినవి ఒక్కొక్కదిక్కు నవోదయార్కరుక్‌
ప్రీత జలేజ సూన తరళీకృత దేవనదీ తరంగముల్‌.
తల్లీ! నీ ప్రతిభా విశేషములు భూతప్రేత హస్తమ్ములన్‌
డుల్లెన్‌ కొన్ని తరాల దాక! ఇపు డడ్డుల్‌వోయె; సౌదామనీ
వల్లీ ఫుల్ల విభావళుల్‌ బ్రతుకు త్రోవల్‌ చూపు కాలమ్ములున్‌
మళ్లెన్‌! స్వచ్ఛతరోజ్జ్వల ప్రథమ సంధ్యాభాను వేతెంచెడిన్‌.
నీ యొడిలోన పెంచితివి నిండుగ కోటి తెలుంగు కుర్రలన్‌!
ప్రాయము వచ్చినంతనె కృపాణము లిచ్చితి, యుద్ధమాడి వా
జ్రేయ భుజాబలమ్ము దరిసింప జగమ్ము, నవాబుతో సవాల్‌
చేయుమటంటి; వీ తెలుగు రేగడీలో జిగి మెండు మాతరో!
తెలగాణమ్మున గడ్డిపోచయును సంధించెన్‌ కృపాణమ్ము! రా
జ లలాముండనువాని పీచమడచన్‌ సాగించె యుద్ధమ్ము! భీ
తిలిపోయెన్‌ జగమెల్ల యేమియగునో తెల్యంగరాకన్‌! దిశాం
చలముల్‌ శక్రధనుః పరంపరలతో సయ్యాటలాడెన్‌ దివిన్‌.
నాలుగు వైపులన్‌ జలధి నాల్కలు సాచుచు కూరుచుండె! క
ల్లోలము రేపినారు భువిలో! నలుదిక్కుల గండికొట్టి సం
ద్రాలకు దారి నిచ్చిరి! ధరాతలమెల్ల స్వతంత్ర వారి ధా
రా లులితమ్ము కాదొడగె, రాజు రివాజులు బూజు పట్టగన్‌.
తెలగాణా! భవదీయ పుత్రకులలో తీండ్రించు వైప్లవ్య సం
చలన మ్మూరక పోవలేదు! వసుధా చక్రమ్ము సారించి ఉ
జ్జ్వల వైభాతిక భానునిన్‌ పిలిచి దేశంబంతటన్‌ కాంతి వా
ర్థులు నిండించిరి, వీరు వీరులు పరార్థుల్‌ తెల్గుజోదుల్‌ బళా!
ఓడి పోలేదు దుర్యోధనాదుల కన్న
    బాధించిన నవాబు వాని చేత
చలియింపలేదు దుశ్శాసనాధము వోని
    వస్త్రాపహరణ ధూర్వహుల జూచి
వెనుకాడలేదు స్త్రీలను మాన భంగాల
    పాలుచేసిన పాపి భటుల గాంచి
కన్నీరు కార్చెరే దెన్నండు పిరికిగా
    ప్రాణాలు గోల్పోవు ప్రజల నరసి
పోరుసల్పిరి వీరాధి వీరులట్లు!
భరత వైజయింతికల స్థాపన మొనర్ప
నెత్తురులు ధారపోసిరి నీళ్ళవోలె!
మానితులు నీసుతుల్‌! తెలంగాణ తల్లి!
మత పైశాచి వికార దంష్ట్రికలతో మాభూమి లంఘించి మా
కుతుకల్‌ గోసెడివేళ గూడ, యెటు దిక్కున్‌ తోచకున్నప్పుడున్‌
బ్రతుకే దుర్భరమైన యప్పుడును ఆంధ్రత్వమ్ము పోనాడ లే
దు, తుదిన్‌ గెల్చితిమమ్మ యుద్ధమున రుద్రుల్‌ మెచ్చనాంధ్రాంబికా!
కాకతీయుల కంచు గంట మ్రోగిన నాడు
    కరకు రాజులకు తత్తరలు పుట్టె
వీర రుద్రమదేవి విక్రమించిన నాడు
    తెలుగు జెండాలు నర్తించె మింట
కాపయ్య నాయకుం డేపుసూపిన నాడు
    పరరాజులకు గుండె పట్టుకొనియె
చాళుక్య పశ్చిమాశా పాలనమ్మున
    కళ్యాణ ఘంటలు గణ గణ మనె
నాడు నేడును తెలగాణ మోడలేదు
శత్రువుల దొంగ దాడికి; శ్రావణాభ్ర
మటుల గంభీర గర్జాట్టహాసమలర
నా తెలంగాణ పోవు చున్నది పథాన.
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - vIratelaMgANamu - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )