కవితలు దాశరథి కవితలు రుద్రవీణ
04. ఉషస్సుందరి
 
మంద సమీర బాలికలు మాటికి మాటికి నీ గృహాంగణం
బందు నటించు చున్నవి, మహావిభవమ్ముల గూర్చుచున్న; వా
నంద కళావిలాసిని! క్షణక్షణ మోహిత రూపిణీ! ఉష
స్సుందరి! నిద్ర మేలుకొని చూడుమి నా నయనాల లోనకున్‌
నా నయనాలలో ప్రళయనర్తనశీలి మహానటుండు ఈ
శానుడు ఫాలలోచనుడు సాచిన అంగుళికా నఖాంకుర
శ్రేణులు భగ్గు భగ్గు మని రెచ్చిన అగ్నిని వోలియున్న, వీ
భూ నభముల్‌ వడంకునిక, మోమును నావయిపున్‌ మరల్పుమా!
నా వయిపున్‌ మరల్పుమి మనస్విని! ప్రప్రథమానురాగ వే
ళా వలమాన తావక విలాస దృశాంచలముల్‌ మదీయ ప్రే
మా వృత మానస హ్రదమునందున పూచిన క్రొత్త క్రొత్త రా
జీవములన్‌ గ్రహింపుమి, నిశీధ తమః పటల ప్రభంజనీ!
చీకటి నీడలన్‌ కలత జెందిన నా జలజాత వల్లికా
నీకము ప్రాకివచ్చినది నీ ఇలు జాడల పూత బూయగా;
వాకిలి మూసి యుంచకుము ప్రాగరుణారుణమూర్తి పాదముల్‌
సోకగనిమ్ము నా జలజసుందరి దివ్య శిరఃప్రదేశమున్‌.
రాతిరి యంతయున్‌ నిదురరాక ప్రవాళ రుచిప్రసర్పణ
స్ఫీత దృశాంచలమ్ముల తపించెడి నామొగమందు రక్తరా
గాతి మనోజ్ఞ బాల రవి హాస వికాసము వచ్చి వ్రాలి ఆ
హూతము సేయుచున్నది మ హోజ్జ్వల ప్రాచ్య దిశాంగణానకున్‌.
అంగుళికా నఖాంకుర మహః పరికంపిత తంత్రికా స్వరా
లింగిత రుద్రవీణ విదళించిన నిద్దుర భారముల్‌ నభః
ప్రాంగణమందు పిట్టలయి ఆటలనాడిన, వింక లే! ప్రభా
తాంగన! నీ కపోలముల కద్దెద నౌషస రక్తరాగముల్‌.
రమణీయార్క మరీచిమాలిక తమిస్రా ఘోర గాఢాంధకా
రములన్‌ పిప్పి యొనర్చి, కాంతిరసధారల్‌ పిండి, ప్రాచీన దే
శములన్‌ వాగులు పోయుచున్నది; ప్రతీక్షామగ్న మాదృక్‌ ప్రజా
సముదాయమ్ముల దప్పి తీర్పుమి ఉషస్సంధ్యా మృగీలోచనా!
నా రుద్రవీణ మీటెడి
తీరులు చూపింతు నీకు, తెరువుమి తూర్పుం
దారులు; బారులు తీరిన
సూర మరీచికల నింట చొరబడనిమ్మా!
AndhraBharati AMdhra bhArati - dAsharathi - rudravINa - uShassuMdari - dASarathi kRiShNamAchArya - Dasaradhi Krishnamacharya ( telugu andhra )