| కవితలు | దాశరథి కవితలు | రుద్రవీణ |
| 06. స్వామి పూజ | |
|
నీ వరుదెంతువా! శశిరమణీమయ దివ్యజటా విలాసి, స్వా మీ! వలమాన పశ్చిమ సమీర కుమారములూడ్చివేసె నా పూవుల తోటనంతయును; మొక్కలు బిక్కమొగాలు వేసె; ల జ్జా వశతన్ వినమ్రత వొసంగె; నినున్ గయిసేయుటెట్లురా! | |
|
దివ్యనదీ జలాలు కొనితెచ్చి ఒసంగితి, మాలతీ లతా నవ్య లతాంత సంతతుల నంజుకొనన్ జనుదెంచు భృంగ జా లవ్యధనుండి కాచితినిరా! దురదృష్టమునాది, పశ్చిమా శా వ్యపదేశ వాతములు సర్వము శూన్య మొనర్చె నంతలో! | |
|
పడమర గాలి తాకిడికి వాడియు రాలిన పూల జాలులో యెడదయు వాడి పోయినది; యెట్టుల నిన్ గయిసేతునింక? నీ అడుగుల సవ్వడిన్ వినిన యంతనె నా నవనాడు లెందుకో గడగడలాడు, నెత్తురులు కన్పడు నా నయనాంచలమ్ములన్. | |
|
స్వామి! నిశాగమమ్మపరసంధ్య; శ్మశానపు బూదిలోన నే దో మెరపొందుచున్నది; పదుల్ పదివందలు వేనవేలుగా భూమిని డాగి పోయిన కవుల్ రసికుల్ విడిపోయినట్టి ఆ శేముషి నిప్పురవ్వవలె చిన్మయమై మెరపొందుచున్నదో! | |
|
నీవు నమంగళాకృతివి, నేనును నీవలె ఈ శ్మశాన వా టీ వసతిన్ వసింతును; నటింతును నీ కనుసైగలందు; సం ధ్యా విశద ప్రదేశమున తాండవ మాడుదు; రుద్రవీణ క్రొం దీవెలపై ధ్వనింతును గతించిన నా వన వైభవమ్ములన్. | |
|
నీకు మదీయ రక్తకణ నిర్మితమైన ప్రవాళ మాలికా నీకము తెచ్చి యిచ్చెద; రణించెద నా నవనాడులందు వీ ణా కమనీయ గీతములు; నా బ్రతుకంతయు కప్పురంబుగా నీకు నివాళి నిచ్చెదను, నిక్కము; చంద్రకళా శిఖామణీ! | |
|
ఈ కొరగాని లోకమున కిప్పుడె నిప్పురగిల్చి కాల్చి, నా లో కదలాడు నూహలకు రూపమొసంగి పునస్సృజింతు; న ఱ్ఱాకట గుందు పేదలకు బ్రహ్మ లిఖించిన కొంటెవ్రాతలో వ్యాకరణమ్ములేదు, రసభంగిమ కానగరాదదేలనో! | |
|
ఫాల నేత్రము విచ్చి లోకాలు కాల్చి నృత్య మాడుము, తీగె సారించి నేను రుద్రవీణ మ్రోగింతును భాద్రపద ప యోద గర్జాభికల్పమ్ముగా, దివమున. | |