కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
ఊరవతల
ఊరవతల
(భారతి - జూలై 1941)
కలల పొదరిళ్ళల్లో
సౌఖ్యంపు నిదురలో
కనిపించి
ఒక తన్వి
మేనక నా పేరు
మేఘాలకు వెనుక ప్రక్క
మా ఊరని మాయమయ్యె
చిరునామా తెలిసికూడ
చేసేదేమీ లేక
ఊహాగానం శాయగ
ఊరవతల కెళ్ళాను,
* * *
కావు! కావు!
ఆకాశం కాకిపిల్ల
నోరు తెరచె
మేతకొరకు
పాపిష్టి ఇనోదయమె
పాముకాటు ఎండపొడిచె
భువికి తగిలె
శివజ్వరం!
ఫలములు లేనేలేవు
పచ్చనకూడా చచ్చి
నీడకూడ ఈయలేని
మ్రోడుచెట్ల జంటపొత్తు!
'ఇనుపసరుకు' ఎనుపోతు
యము నెక్కడో దింపేసి
తనుమాత్రం ఎదురాయెను!
ప్రేతలతో
ఇల్లట్టుల
బూరుగ వృక్షంమీద
కళ్ళజోడు పెట్టుకున్న
గరుడ పురాణ బ్రాహ్మడు
కంఠమెత్తె ఘూకమ్ము!
కాటకంపు
తాటకిలా
ఆరుబయట మిల్లు
విశ్వకర్త హృదయంలో
దుస్వప్నంలా
భుగ భుగ మను
పొగగొట్టం
ఆకాశమె
చిల్లులువడ
అతితారస్థాయి
నా మిల్లరచింది!
పోలీసుల ఈలకు
నిశిరాతిరి
పసిపిల్లడు
కలత నిదుర
కళవళ పడ్డట్టు
కణకణ మండే కళ్ళతో
కార్మిక సోదరు డదరెను!
జీవనమ్మె తీసినారు
జలమంతా మిల్లుకెత్త
పాడలేని గులకరాళ్ళ
పాతవడ్డ సెలయేరు
మురికిబట్ట లెన్నొమోసి
రజకునిచే రట్టు!
పురమంతా
రాతిరంత
తిరగడం
కాగితాల భోజనం
పోయిన ఆ యేటినవ్వె
పుక్కిట నెమరేసుకుంటు
గండశిల నీడలోన
కనుమోడ్చెను
గార్దభస్వామి!!!
శిలకెంతొ దగ్గరగా
గొప్పవారి చూపుల్లా
గుచ్చుకొనె యీతచెట్టు!
అవిశ్వాసంపు బ్రతుకు
అర ఘడియైనను నోర్వదు
పోయిన ఆ పూర్వపు యజమాని
పోతిరాజు
ఎముకలతో
చెలగాటం సాగించి
శ్మశానాల తిరిగివచ్చు
శునక సందడి!
'అల్‌బిదా! అల్‌బిదా!'
తురకల పండుగలోన
ఊరేగే పీరుల్లా
ఏతచేత గీతవడ్డ
తాటివనం!
బ్రహ్మచెముడు
కంచెమధ్య
పూర్ణిమ సంధ్యల్లోన
ఘడియైనా ఉదయాద్రిని
రుధిరజ్యోతై వెలిగే
జాబిల్లి!
మృతశరీర
ఆక్రమణ
ఘటాకాశ
అరుణారుణ
రక్త సిక్త-
మోముతోడ
'మా అమ్మె చంపింది!
మా అమ్మె చంపింద'ను
మౌనముగ
గాజుకళ్ళ
పురిటిపిల్ల!
వెనుతిరిగె చూచాను
వెంటాడె మృత్యువులా
వెరపు గొలిపె
నా ఛాయ!
అసురులతో పోరాటం
మిషెన్‌ గన్నులారాటం
జీవహింస కూడదని
చేతచిక్కినారు!!
భూమికంత ఈనాడే
గ్రామదేవతోత్సవమ్ము
కాలజ్ఞానులు మీరు
'కాచుకోండి కత్తిపదును
కాచుకోండి
కవిగార'ని
గాలి కబురు
చెప్పింది!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - Uravatala - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )