కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
గడ్డిపరక
గడ్డిపరక
(నవశక్తి - 1941)
నడవండి,
నడవండి!
నామీంచి నడవండి
గడ్డిపరకను!
గడ్డిపరకను!
పూజా సమయాల
పూవును
దూర్వాంకురాన్ని
అవసరం తీరాక
అవతల కనబడితె
చుల్కనగ చూచేటి
గడ్డిపరకను!
గడ్డిపరకను!
నడవండి,
నడవండి!
నామీంచి నడవండి!!
పల్లకీ
దిగినట్టి
పెళ్ళికొడుకులు మీరు
పట్టుతివాసీని నేను
నడవండి,
నడవండి!
నామీంచి నడవండి!!
గడ్డిపరకను!
గడ్డిపరకను!
పశువుల నోటికి
పాయసాన్ని
మీ సుకుమార
పాదాల మకరికను
గడ్డిపరకను!
గడ్డిపరకను!
నడవండి,
నడవండి!
నామీంచి నడవండి!!
మీపైడి పాదాల
మృదు రజోలేశాలె
నా హృత్‌కుశేయములో
ఉల్కలా పాతాలు
నడవండి,
నడవండి!
నామీంచి నడవండి!!
గడ్డిపరకను!
గడ్డిపరకను!
మాతృవర్గంవాడు
మా అన్న
పన్నగమ్ముల
రసనలుత్తరించిన
మిన్న!
నేటికి మీ పితృకార్యంనాడు
పారణమీద మీ చేతిమీద
మరకత
అంగుళీకమ్ము!
గతులు కల్పించేటి
గడ్డిపరకలము
నడవండి!
నడవండి!
మిన్ను విప్పిన
రక్త పతాకం
మన్ను సత్తువె
తెలిపింది!
ప్రాభాత పశ్చిమానిలము
పాడినపాట
కాకాసురుని కధ
జ్ఞాపకం తెచ్చింది
నన్ను నే తెలుసుకున్నాను!
ఆగండి!
ఆగండి!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - gaDDiparaka - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )