కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
దేశమాత
దేశమాత
(ప్రతిభ - అక్టోబరు 1937)
ఎండాకాలం!
ఎండాకాలం!
పగళ్ళు నెగళ్ళు
మండే రోడ్డు
పన్నెండుగంటలు!
కాలం కాలిన
గుడ్డపీలికై
ధూళిరేగినది
విలయ వేళల
విహాయసాలు
విస్ఫులింగములు
వర్షించాయి!
గుప్పెడు అన్నం
గ్రుక్కెడు నీళ్ళ
స్వాతివానకే
ముత్యపుచిప్పై
కరువే రూపం దాల్చి
కడుపే చెరువై ఏడ్చి
నెలత ఒకర్తుక
నిలబడ్డాది
భిక్షాపాత్రికతో!
రెండు కన్నులు
కాలిన బండికమ్ములు
పట్టలేని కూర్మిని
పచ్చని సంపెంగల డాసి
విగత ప్రాణులు
వాలిన తుమ్మెద బారులు
కాలిన మారుని తూపులు
కలికి చూపులు
అంటీ అంటని
ఆమె శరీరపు
చాలీ చాలని చీరను
తొంగి చూచే మానం
'ఉన్నాడా చిన్ని కృష్ణుడు?
అనసూయేదీ?
అరుంధతే ద'ని
ప్రశ్నించింది!
చచ్చిన బాలింతల
వెచ్చని చనుబాల తీపి
మచ్చరించు కంఠముతో
'ఆకలి! దాహం!
అన్నం! అన్నం!' అంటూ
అటమటించింది
అగ్నివీణయై
ఆలాపించింది
ఖణేలు మన్నవి
కకుప్పాళికలు!
బలి ప్రముఖుల
పాతర మా భూమి
అతిథి పూజలకు
మొదటి వారలము!
కర్ణుడు మావాడంటూ
గంతులు వేసే
దేశనాయకులు
అన్నపూర్ణను
ఆరాధించే ముగుదలు
జాలకములపై
తడిపిన వట్టివేళ్ళ
తట్టీలు కట్టిన ఇండ్ల
ద్వార ముఖమ్ములు
బంధించారు
కన్నులు మూసి
నిద్రించారు!.
దేశం అంటూ
దేవుళ్ళంటూ
కొలిచే కళ్లకు
బానిసత్వమే
ప్రబలింది.
ఉసురుసురైంది
ఉమ్మలించింది
అసువులు వీడి
చచ్చిన దేశమాతయై
చాపచుట్టగ
నేలకు వాలింది!
వీధి కాలువను
బురద నీటిలో
విశ్రమించిన
శ్వనాధు డొక్కడు
నిశ్వసించినాడు.
ముందరి కాళ్ళకు
బంధంతో
కాకితమ్ములే
కసువని మేస్తూ
చంక్రమణం చేసే
చక్రీవంతపు చక్షులు
చిలుపచిలుపగా
తొలకరించినవి.
తోడులేని
నీడలేని
ఆడుదాని
చూడజాలక
తరుశాఖల్లో
తలక్రిందై
తపించిపోయి
ఋషి పక్షొక్కటి
నేలకు రాలింది.
భూపతి ఆజ్ఞను
భూమి పుట్టువు
చిచ్చున జొరబడ్డాది
శీలంకోసం
ఆనాడు!
ఆకలి దీర్చని
మానం గప్పని
దేశం కోసం
మట్టి ప్రమిదలో
వత్తై కాలిందీ
మానిని ఈనాడు!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - dESamAta - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )