కవితలు రుధిరజ్యోతి
శ్రీరంగం నారాయణబాబు
కపాలమోక్షం
కపాలమోక్షం
(ప్రతిభ - 1938)
నిర్వికల్ప సమాధి
నిమీలితాక్షుడు
వేదసన్నిహితు
డాది శంకరు
తపస్సమాధిని
ఓంకారమ్మే
హుంకరించినది
చలించినవి
చరాచరమ్ములు
భూతా లుద్రేకించినాయి
కాటుక పెట్టిన
నయనేంద్రియమై
కర్మసాక్షియే
చీకటు లురిలాడు.
అభ్రగంగలో
శుభ్రవీచికల
హాలాహలమే
తలఎత్తింది
శేషుని ఫణాల
మణుల కాంతులు
వీసరవోయినవి
పూదోటలు
లేనేలేవు
వసంతములు
రానేరావు
ముల్లోకమ్ముల
తబిసి మిన్నలు
ముర్మురించినారు
అనంతకోటి
జీవరాశులు
హాహాకారం
చేశాయి
"హరోం! హరా!" యని
"పాహి! పాహి!" యని
ప్రణమిల్లాయి!
ఆర్ద్రమైనది
ఆ మహామహుని
అంతఃకరణ
అంతట అక్షులు విప్పి
'ఆకలి! ఆకలి!' అంటూ
భిక్షాపాత్రకు
చేయిచాపినాడు
ఉగ్రతపస్సున
మ్రగ్గినది
వేడికంటికి
సూడిద వెట్టిన
బ్రహ్మకపాలం
పట పట
పళ్ళుకొరికినాడు
నటరాజు!
భూతపిశాచాల్‌
బొబ్బిరిల్లినవి
వందిమాగధులు
వణికారు
భయపడి బసవడు
రంకెవేసినాడు.
భూలోకమ్మున
తురకల గోరీలందున
క్రైస్తవుల సమాధులందున
హిందూ శ్మశానవాటుల
కపాలమ్ములు
విక విక నవ్వినవి
పునుకలు
పులకరించినవి
కంకాళమ్ములు
ఘల్లున మ్రోగినవి!
శ్వేతపర్వతపు
శిఖరాంచలముల
కనకభాండమే
కదిలింది.
స్వాహావల్లభు
సువర్ణగర్భం
సళుపరించినది
కళవళించినది.
గంగవక్షమే
పాలపోటుతో
కళవళపడ్డాది
సింధుగర్భమున
గంగకడుపులో
లవణసాగరపు లోతుల్లో
దాగిన నేత్రాగ్ని
మానవరూపం దాల్చింది.
మన్నే వెలిగించింది
మిన్నే పొగచూరింది!
మంటల్లోనే పుట్టాడు!
మంటల్లోనే పెరిగాడు!!
మంటల్లోనే మడిశాడు!!!
అగ్నివీణయై
భుగ్నకంఠమై
భగ్నగీతియై
తారక మంత్రం
పరంజ్యోతిగా
వీరశైవుడు!
భారత వీరుని
కపాల మొక్కటి
కపర్ది చేతిని
రివ్వున వాలింది!
కెవ్వున కేకేశాడు
కంఠేకాలుడు!
ఫాల నేత్రమే
స్పందించింది
అండ పిండ బ్రహ్మాండమంతా
తాండవనృత్యం చేసింది
ఆనందాశ్రుల నించింది.
శేషుని ఫణాల మెత్తని శయ్య
పుడమి ఒత్తిగిలింది.
ఎడారి పుష్పించింది!
ఎందరు పుట్టలేదు
ఇంకెందరు గిట్టలేదు
అందరికీ లభియిస్తుందా
హాలాహల మంటిన
హస్తస్పర్శ!
పెదవుల చుంబనం!
కపాలమోక్షం!
కపాలమోక్షం!!
AndhraBharati AMdhra bhArati - kavitalu - rudhirajyOti - kapAlamOxaM - SrIraMgaM nArAyaNabAbu Srirangam Narayana babu Sriramgam NarayaNababu rudhira jyothi rudhirajyothi - telugu kavitalu - tenugu andhra ( telugu andhra andhrabharati )